టీడీపీ, వైసీపీ నేర్చుకోవాల్సిన రాజ‌కీయ పాఠాలు ఇవే…?

-

రాష్ట్రంలో రాజ‌కీయాలు వేడెక్కాయి. ఒక‌రిపై ఒక‌రు దుర్భాష‌లాడుకునే స్థాయికి దిగ‌జాయ‌ని అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఏకంగా ఒక డిప్యూటీ సీఎం నోరు పారేసుకోవ‌డం.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని `లం.. కొడ‌క‌` అని వ్యాఖ్యానించ‌డం వంటి ప‌రిణామాలు రాష్ట్రానికి చెడ్డ‌పేరు తెస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. అదేస‌మ‌యంలో టీడీపీ కూడా అదే రేంజ్‌లో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ప్ర‌తి చిన్న విష‌యాన్నీ రాజ‌కీయం చేసేందుకు పాకులాడుతోంది. దీంతో ఇరు పార్టీల‌పైనా.. ప్ర‌జ‌ల్లో చుల‌క‌న భావం ఏర్ప‌డుతోంద‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం.

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు ఎక్క‌డైనా విమ‌ర్శ‌లు చేసుకోవాల్సిందే. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నించాల్సిందే. అయితే, ఇది ప్ర‌జాస్వామ్య యుతంగా.. ప్ర‌జ‌లు కూడా ఆలోచించుకునేలా ఉండాలి త‌ప్ప‌.. ఎబ్బెట్టుగానో.. త‌ల‌దించుకునేలాగానో ఉండ‌రాద‌నే క‌నీస సూత్రాన్ని నాయ‌కులు మ‌రిచిపోతున్నార‌నేది వాస్త‌వం. అస‌లు జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డ‌మే ఇష్టం లేని సిద్ధాంతంగా మ‌లుచుకున్న  ప‌రిణామం..టీడీపీలో ఇప్ప‌టికీ క‌నిపిస్తోంది. ఇక‌, టీడీపీని ఒక పార్టీగా కూడా గుర్తించ‌ని ప‌రిస్థితి వైసీపీలోనూ క‌నిపిస్తోంది.

చంద్ర‌బాబును ఓ కులానికి నాయ‌కుడిగా పేర్కొనే ప్ర‌య‌త్నాలే సాగుతున్నాయి త‌ప్ప‌..పార‌ద‌ర్శక విధానంలో సాగుతున్న రాజ‌కీయాలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మ‌రి ఈ ప‌రిణామం.. ఒక్క ఏపీలోనేనా.. పొరుగునే ఉన్న తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క వంటి రాష్ట్రాల్లోనూ ఉందా? అంటే.. వ్య‌క్తిగ‌తంగా దూష‌ణ‌లు.. హ‌ద్దుమీరిన వ్యాఖ్య‌లు లేవ‌నే చెప్పాలి. విష‌యంపై మాత్ర‌మే ఆయా రాష్ట్రాల్లో నాయ‌కులు పోరాడుకుంటున్నారు త‌ప్ప‌.. వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల పై కామెంట్లు చేయ‌డం లేదు. పైగా కేవ‌లం ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పైనే ఫోక‌స్ పెడుతున్నారు.

ఇటు అధికార పార్టీ, అటు ప్ర‌తిప‌క్షాలు కూడా వ్యూహాల‌పై వ్యూహాలు వేసుకుంటున్నా.. వ్య‌క్తిగ‌త దాడుల‌కు, విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉంటున్నాయి. కానీ, ఏపీలో మాత్రం ఇటు అధికార‌, అటు ప్ర‌తిప‌క్షాలు రెండూ కూడా ల‌క్ష్మ‌ణ‌రేఖ‌లు దాటుతున్నాయ‌నే వాద‌న బ‌లం గా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ప‌రిస్థితి ఇలానే సాగితే.. ఇరు పార్టీల‌కు, రెండు పార్టీల్లోని నాయ‌కుల‌కు కూడా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు. ప్ర‌జా కోణంలో చూసిన‌ప్పుడు ఏపార్టీ అయినా ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌రి ఆ దిశ‌గా అడుగులు వేస్తారో లేదో చూడాలి.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version