ఎవరికి వారు శత్రువు ఎలా అవుతారు..? అసలు శత్రువు అంటే ఎవరు..? ఒకరిని ఎదగనివ్వకుండా ఆపేసేవాడే అసలైన శత్రువు. ఈ నిర్వచనం కరెక్ట్ అయితే మీలోని కొన్ని లక్షణాలు మిమ్మల్ని ఎదగనివ్వటం లేదు. ఆ లక్షణాలేంటో తెలుసుకుని వాటిని దూరం చేసే ప్రయత్నం చేద్దాం.
పాత గాయాలను మరచిపోకపోవడం:
కొంతమంది ఉంటారు.. తమకు జరిగిన అవమానాలన్నిటినీ గుర్తు పెట్టుకుంటారు. అప్పుడప్పుడు వాటిని తలుచుకొని ఏడుస్తుంటారు. నిజానికి ఇలా చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏమీ లేదు. పాత వాటిని ఎంత తొందరగా మర్చిపోతే మీరు జీవితంలో అంత వేగంగా ఎదుగుతారు. జీవితం చాలా పెద్దది అని తెలుసుకున్నప్పుడే జీవితంలోకి వచ్చే కొత్త అనుభవాలను మీరు ఆస్వాదించగలుగుతారు. ఒకటి గుర్తు పెట్టుకోండి.. అవమానాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి.
అవతలి వాళ్ళ మీద నిందలు వేయటం:
జీవితంలో ఎదగకపోతున్నందుకు కారణం పక్కవాళ్లే అని నిందలు వేయటం వెంటనే మానుకోండి. ఇలా నిందలు వేసుకుంటూ పోతే మీరు ఎదగలేరు. ఒక పని ఒక విధంగా జరిగినప్పుడు మరో విధంగా ట్రై చేయడమే మంచిది.
కంఫర్ట్ జోన్ వదలకపోవడం:
చాలామంది ఈ తప్పు చేస్తుంటారు. తాము ఉన్న ప్రదేశం బాగానే ఉంది కదా అని అక్కడే ఉండాలనుకుంటారు. కొత్త అడుగు వేస్తే ఓడిపోతానేమో అన్న భయం ఉంటుంది. దీనివల్ల జీవితంలో ఎదగకుండా మిగిలిపోతారు.
పొగడ్తల కోసం పరుగు:
ఒక పని చేయగానే అది బావుందా బాలేదా అని జనాల్ని అడిగే అలవాటు మానుకోండి. ఆ పని మీకు ఎంత మంచి చేసిందనే దాన్ని మాత్రమే గుర్తుంచుకోండి. ప్రతి దానికి అవతలి వాళ్ళ వ్యాలిడేషన్ అవసరం లేదు.
జీవితమంటే పరుగు పందెం కాదు:
జీవితమంటే అవతలి వాళ్ళని దాటేసి వెళ్లిపోవడం అనే భ్రమ నుండి పక్కకు రండి. ఒకరిని దాటేసి వెళ్ళిపోతేనే అభివృద్ధి చెందినట్లు మీరు ఫీల్ అయితే.. మీరు బ్రతికున్నన్ని రోజులు మీ ముందు ఎవడో ఒకడు ఉంటాడు. మీరు వాడిని దాటేయాలని ఆశతో జీవితాన్ని ఆస్వాదించకుండా మిగిలిపోతారు.