సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్‌కు చెందిన ప్రొడక్ట్స్ ఎంత ఖరీదును కలిగి ఉంటాయో అందరికీ తెలిసిందే. వాటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం ధనికులు మాత్రమే వాటిని వాడుతుంటారు. స్థోమత ఉన్నవారు కూడా కొంటుంటారు. అయితే కొందరు వ్యక్తులు మాత్రం ఆ వస్తువులకు ఉండే విలువ తెలిసి ఏకంగా రూ.50 కోట్ల విలువైన యాపిల్ ప్రొడక్ట్స్‌ను దోచేశారు. అది కూడా సినీ ఫక్కీలో జరిగింది.
సెంట్రల్ ఇంగ్లండ్‌లో నార్తాంప్టన్‌షైర్ ప్రాంతంలో ఎం1 మోటార్ వే పై వెళ్తున్న ఓ ట్రక్కును కొందరు వ్యక్తులు మార్గమధ్యలో ఆపేశారు. అనంతరం ట్రక్కు డ్రైవర్‌ను, సెక్యూరిటీ గార్డును కట్టేశారు. తరువాత ట్రక్కును పక్కనే 9 మైళ్ల దూరంలో ఉన్న లుటర్‌వర్త్ అనే టౌన్ పరిధిలోని ఓ ఇండస్ట్రియల్ పార్క్‌కు తరలించారు. అనంతరం అందులో ఉన్న 48 బాక్సుల్లోని దాదాపుగా 6.6 మిలియన్ డాలర్ల (సుమారుగా రూ.50 కోట్లు) విలువైన యాపిల్ ప్రొడక్ట్స్‌ను ఇంకో ట్రక్కులో వేసి అక్కడి నుంచి వాటిని తరలించారు. ఈ క్రమంలో వారు భారీ ఎత్తున చోరీకి పాల్పడ్డారు.
అయితే యాపిల్ ప్రొడక్ట్స్‌ను దొంగిలించిన వారు ఎవరు, ఎందరు ఉన్నారు ? అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ వారి కోసం అక్కడి పోలీసులు గాలిస్తున్నారు. ఇక తక్కువ ధరలకే యాపిల్ ప్రొడక్ట్స్ ఇస్తామంటూ ఎవరైనా వస్తువులను అమ్మజూపితే తమకు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా పట్టణంలో అంతటి భారీ దోపిడీ జరగడం ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశమవుతోంది.