దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు ఎలా మండిపోతున్నాయో అందరికీ తెలిసిందే. కొన్ని చోట్ల కేజీ ఉల్లిపాయల ధర రూ.100కు పైగానే పలుకుతోంది. దీంతో ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు తక్కువ ధరలకే ఉల్లిపాయలను విక్రయిస్తున్నాయి. అయితే ఓ వైపు పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు ఓ రైతు తన పొలంలో పండించిన ఉల్లిపాయల పంట పోయిందని ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మధ్యప్రదేశ్లోని మంద్సౌర్ ప్రాంతం రిచ్చా గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో ఉల్లిపాయలను పండించాడు. పంటను తీయాల్సి ఉండగా, మంగళవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని పొలంలో పండిన ఉల్లిపాయలను పెకిలించి వాటిని దొంగతనం చేసి తీసుకెళ్లారు. తెల్లారి చూసే సరికి పొలం చిందర వందరగా ఉండడం, ఉల్లిపాయలు దొంగతనం జరిగి ఉండడం చూసి ఆ రైతు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఉల్లిపాయల దొంగల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. కాగా చోరీకి గురైన ఉల్లిపాయల విలువ రూ.30వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.