వ్యాయామం తర్వాత చేయకూడని పనులివే..!

-

ప్రతిరోజు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. చాలా మందికి శారీరక శ్రమ తగినంత ఉంటేనే శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయని, అనారోగ్యాలకు దూరంగా ఉంటారని వారు తెలుపుతున్నారు. జిమ్‌లలో బరువులు ఎత్తుతూ కఠినమైన వ్యాయామాలు చేయలేనివారు.. ఉదయపు నడక లేదా పరుగును ఎంచుకుంటుంటారు. రోజూ పరుగెత్తడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పరుగు వల్ల శరీరంలో ఎడ్రినలిన్ ఉత్పత్తి పెరుగుతుందన్నారు. అయితే వ్యాయామం లేదా పరిగెత్తేవాళ్లు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాయామం

వ్యాయామం చేసిన తర్వాత గుండె వేగం పెరుగుతుంది. అంతేకాకుండా శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది. అలాంటి సమయంలో విశ్రాంతి చాలా అవసరం. వ్యాయామం చేసిన వెంటనే పడుకోవడం వల్ల ఫలితం ఉండదని నిపుణులు చెబుతున్నారు. రన్నింగ్ తర్వాత ఏ పనీ చేయకుండా ఎక్కువ సమయం కూర్చోవడానికి బదులుగా.. శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడని చిన్నపాటి పనులు చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల రక్త ప్రసరణ రేటు మెరుగు పడుతుంది. ఇది వ్యాయామంలో కోల్పోయిన శక్తి తిరిగి పొందడానికి కృషి చేస్తుంది.

శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. వ్యాయామం చేసిన తర్వాత బాడీ డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి. వ్యాయామం చేసిన తర్వాత కచ్చితంగా నీరు తాగాలి. నీళ్లు తాగడంతో పాటు సరైన పోషకాహారం తీసుకుంటే కండరాలు శక్తివంతంగా మారుతాయి. వ్యాయామం పూర్తయిన అరగంటలోపు ఆహారం తీసుకోవాలి. అలాగని ఎక్కువ మొత్తంలో తినకూడదు.. డైట్ ఆధారంగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి.

దీంతోపాటు.. వ్యాయామం చేసిన తర్వాత వేడి నీటితో స్నానం చేయకూడదు. ఐస్ ముక్కలతో కండరాలకు మర్దన చేయాలని చెబుతున్నారు. ఆ తర్వాత వేడి నీటితో స్నానం చేయడం మంచిది. ఒత్తిడికి గురైన, నొప్పి కలిగే కండరాలకు వాపును తగ్గించడానికి ఐస్ ముక్కలు ఉపయోగపడతాయి. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అవసరమనుకుంటే వేడి నీటితో స్నానం చేయాలి. వ్యాయామం ముగిసిన వెంటనే కాకుండా.. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాతే కఠినమైన పనులు, ఎక్కువ బరువులు ఎత్తడం వంటివి చేయాలి. రన్నింగ్ వల్ల శరీరం శక్తిని కోల్పోతుంది. ఆ తర్వాత వెంటనే బరువులు ఎత్తడం వంటి పనులు చేయడం వల్ల ఇంకా అలసిపోతామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version