ఆ కంపెనీలో ఉన్న ఉద్యోగులందరికీ ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున జీతం ఇంక్రిమెంట్‌గా పడింది. ఈ మొత్తాన్ని వారు ఏడాది మొత్తం మీద అందుకోనున్నారు.
సమాజంలో ఉన్నది నూటికి 80 శాతానికి పైగా పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే. చాలీ చాలని జీతాలు, కష్టాలతో వారు సంసారాలను నెట్టుకొస్తుంటారు. ఈ క్రమంలో అలాంటి వారిలో ఉద్యోగస్థులైతే జీతాలు ఎప్పుడు పెరుగుతాయా.. అని ఆలోచిస్తుంటారు. పెరిగే ఆ కొంచెం వేతనం కోసం కళ్లు కాయలయ్యేలా ఎదురు చూస్తుంటారు. అయితే ఆ కంపెనీకి చెందిన ఉద్యోగులు కూడా సరిగ్గా ఇలాగే ఎదురు చూశారు. కానీ వారి పంట పండింది. వారి బాస్ మనస్సున్న మారాజు కావడంతో.. తనకు వచ్చే జీతాన్ని కట్ చేసుకుని దాన్ని తన ఎంప్లాయ్‌లకు షేర్ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే…
అమెరికాలోని గ్రావిటీ పేమెంట్స్ అనే ఓ ప్రైవేటు క్రెడిట్ కార్డు ప్రాసెసింగ్ కంపెనీకి డ్యాన్ ప్రైస్ అనే వ్యక్తి సీఈవోగా పనిచేస్తున్నాడు. అయితే సీఈవో కనుక ఆ కంపెనీ ఉద్యోగులందరి కన్నా అతనికే జీతం ఎక్కువగా ఉంటుంది. అయితే తనకు ఎక్కువగా జీతం వస్తుందని, మిగిలిన ఉద్యోగులందరికీ చాలా తక్కువ వేతనాలు ఉన్నాయని, వారు చాలీచాలని జీతాలతో జీవనం గడుపుతున్నారని తెలుసుకున్న డ్యాన్ ప్రైస్ ఈ సారి మాత్రం తనకు వచ్చే ఇంక్రిమెంట్‌తోపాటు తన జీతం నుంచి 90 శాతం వరకు కట్ చేసి ఆ మొత్తాన్ని తన కింద పనిచేస్తున్న ఇతర ఎంప్లాయిలకు షేర్ చేశాడు. దీంతో ఆ కంపెనీలో ఉన్న ఉద్యోగులందరికీ ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున జీతం ఇంక్రిమెంట్‌గా పడింది. ఈ మొత్తాన్ని వారు ఏడాది మొత్తం మీద అందుకోనున్నారు.
కాగా డ్యాన్ ప్రైస్‌ను ఈ విషయంపై అక్కడ మీడియా ప్రశ్నించగా.. ఆయన అందుకు స్పందిస్తూ.. కంపెనీలో తనకే అధిక వేతనం ఉందని, ఉద్యోగులు చాలా కష్టపడుతున్నా తనకు ఎక్కువ జీతం ఇవ్వడం తనకు సంతృప్తినివ్వలేదని, అందుకనే వారికి తన జీతాన్ని ఇంక్రిమెంట్ రూపంలో ఇచ్చానని చెప్పాడు. ఇక కంపెనీలో కొందరు జీతం తక్కువ ఉందని పిల్లల్ని కూడా కనలేదని, కానీ వారిప్పుడు చాలా హ్యాప్పీగా ఉన్నారని, పిల్లల్ని కనేందుకు కూడా సిద్ధమవుతున్నారని అన్నాడు. ఈ క్రమంలో డ్యాన్ ప్రైస్ ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యాడు. బాస్ అంటే ఇలా ఉండాలని.. అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు.