ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉమ్ పున్ తుఫాన్ వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. తుఫాన్ స్వల్పంగా బలపడిందని ఈ మేరకు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ క్రమంలో ఈ తుఫాన్ మరో 12 గంటల్లో బలపడుతుందని.. తరువాత అది తీవ్ర తుఫాన్‌గా మారుతుందని అధికారులు తెలిపారు. ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 990 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని వారు తెలియజేశారు.
కాగా ఈ తుఫాన్ గంటకు సుమారుగా 6 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని అధికారులు తెలిపారు. ఉత్తర ఈశాన్య దిశగా తుఫాన్ వెళ్తుందని దీంతో మే 20వ తేదీన మధ్యాహ్నం బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య సాగర్ దీవుల వద్ద ఈ తుఫాన్ తీరం దాటుతుందని వారు అంచనా వేస్తున్నారు.
ఇక తుఫాన్ వల్ల ఒడిశా, బెంగాల్, కోస్తాంధ్రలో ఒక మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కనుక తీర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.