పీహెచ్‌డీ విద్యార్థిని దీప్తి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతంగా చేశారు. ఆమె ఆత్మహత్యకు కారణమైన నిందితుల్లో ఇద్దరికీ, ఆమె తండ్రికి సైతం రిమాండ్ విధించారు. అంతకుముందు నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని బాధితురాలి తండ్రి సంగీతరావు తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని కానిస్టేబుల్ అనిల్ తరచూ వేధించడంతోనే మనస్తాపానికి గురైన దీప్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తన తండ్రి తీసుకున్న డబ్బుల కోసం తనను పదే పదే బెదిరిస్తున్నారని, స్టేషన్‌కు పిలిపించి కానిస్టేబుల్ అనిల్ వేధింపులకు గురిచేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దీప్తీ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కానిస్టేబుల్ భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య సైతం కేసు విత్ డ్రా చేసుకోవాలంటే అధికంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితురాలు వీడియోలో వాపోయింది. కాగా, తన భార్యకు జాబ్ పెట్టిస్తానని కానిస్టేబుల్ అనిల్‌ను మోసం చేసిన కేసులో దీప్తి తండ్రి సంగీతరావు.. బాధితురాలిని వేధించిన కేసులో అనిత, ఆమె తండ్రి సోమయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు పోలీసులు తరలించారు. కాగా, అనిత భర్త అనిల్(కానిస్టేబుల్),మరో వ్యక్తి సైదులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.