టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తెలంగాణలో కలకలం రేపింది. పేపర్ లీకేజీ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఈ వ్యవహారంపై రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. మంగళవారం రోజున టీఎస్పీఎస్సీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగాయి. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేశారు.
ఆందోళనల నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఇవాళ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నిన్న విద్యార్థి సంఘాలు కార్యాలయాన్ని ముట్టడించి గేట్లు దూకి, బోర్డులు ధ్వంసం చేశారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు కార్యాలయం వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. దక్షిణ మండలం డీసీపీ కిరణ్కరే….. కార్యాలయం వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అదనపు బలగాలతో భద్రతను ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు.. అగ్నిమాపక శకటాలను సిద్ధంగా ఉంచారు.
నిన్న ఘటనపై చర్యలు చేపట్టిన పోలీసులు.. ఏడుగురు బీజేవైఎం కార్యకర్తలపై కేసులు నమోదు చేసి, వారిని అరెస్టు చేశారు. యువమోర్చా రాష్ట్ర అధ్యుడు భానుప్రకాశ్ సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం బేగంబజార్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.