డిసెంబర్ 26 సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని 13 గంటల పాటు మూసివేస్తున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.
భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళరేఖపైకి రావడం వల్ల గ్రహణాలు ఏర్పడతాయి. భూమికి ఇరువైపులా సూర్యుడు, చంద్రులు సంచరిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇవి తమ స్థితిని మార్చుకోవడంతో గ్రహణం సంభవిస్తుంది. బుధవారం రాత్రి నుంచి 13 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు.
ఈ ఏడాది ఇప్పటికే నాలుగు గ్రహణాలు సంభవించాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. జనవరి, జులై నెలలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. ఈ ఏడాదిలో చిట్టచివరి సూర్యగ్రహణం డిసెంబరు 26న గురువారం సంభవిస్తుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం దేశవ్యాప్తంగా కనువిందు చేయనుంది. జ్యోతిషం ప్రకారం ఇది కేతుగ్రస్త కంకణాకార గ్రహణం. ఇది మూల నక్షత్రం, ధనుస్సు రాశిలో సంభవిస్తుంది. గ్రహణం రోజున ఆగమశాస్త్రం అనుసరించి ఆలయాలను మూసివేస్తారు. ఈ నేపథ్యంలో సూర్యగ్రహణాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. అయితే ఇదే సందర్భంలో తిరుపతికి సమీపంలో ఉన్న వాయులింగ స్వరూపమైన శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని గ్రహణ సమయంలో తీసి ఉంచుతారు.
– కేశవ