పశ్చిమ బెంగాల్ ప్రజలకు సీఎం మమతా బెనర్జీ అనేక ఎన్నికల వాగ్దాలను ఇచ్చారు. ఈ మేరకు దీదీ బుధవారం తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అందులో అనేక వాగ్దానాలను పొందు పరిచారు. ముఖ్యంగా ఆమె రైతులు, పేదలపై ఎన్నికల వాగ్దానాల జల్లు కురిపించారు.
తాము మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులకు ఎకరానికి రూ.10వేల పెట్టుబడి సహాయం అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం అక్కడ కృషక్ బంధు స్కీమ్ కింద రైతులకు ఎకరానికి రూ.6వేలు అందిస్తున్నారు. విద్యార్థులకు రూ.10 లక్షల విలువైన క్రెడిట్ కార్డులను అందజేస్తామని, దీంతో వారు ఉన్నత విద్యను అభ్యసించవచ్చని, ఆ కార్డులకు కేవలం 4 శాతం మాత్రమే వడ్డీని వసూలు చేస్తారని తెలిపారు. ఇక తాము అధికారంలోకి వస్తే 5 లక్షల మందికి ఉద్యోగాలను ఇస్తామని తెలిపారు.
ఇక తాము అధికారంలోకి వస్తే వెనుక బడిన, బలహీన వర్గాల వార్షిక ఆదాయాన్ని పెంచుతామని సీఎం మమత అన్నారు. బంగ్లా ఆబాస్ యోజన స్కీమ్ కింద రాష్ట్రంలోని పేదలకు 25 లక్షల అదనపు ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. అక్కడి మహిష్య, తిలి, తంబుల్, సాహా వర్గాలను ఓబీసీలుగా గుర్తిస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు రూ.25వేల కోట్ల ఆదాయం ఉండేదని, దాన్ని ఇప్పుడు రూ.75వేల కోట్లకు పెంచామని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన అనంతరం సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ పై వివరాలను వెల్లడించారు.
కాగా పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు గాను మార్చి 27 నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు పలు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 2వ తేదీన వెల్లడవుతాయి.