నాడు రైతుబిడ్డ.. నేడు జిల్లాకు డీఎస్పీ..!

-

రైతు కుటుంబంలో జన్మించిన ఆ యువకుడు తండ్రి కష్టాలను కళ్లారా చూశాడు. నాగలి పట్టి వ్యవసాయం చేశాడు. తమకు ఉన్న పొలంలో తన తల్లిదండ్రులు సాగుచేస్తూ వచ్చిన డబ్బుతో ఎంతో కష్టపడి బాగా చదివించారు. మట్టిలో మాణిక్యం కదా.. కసిగా చదివాడు..పదిమందికి సాయం చేయాలనే కృషితో ఎదిగి నాగలిపట్టిన అదే చేత్తో నేడు లాఠీ పట్టాడు. విజయనగరం జిల్లాకు చెందిన ఏగిరెడ్డి ప్రసాదరావు నేడు ప్రొద్దుటూరు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించాడు. ఆయన మజిలీ గురించి ఆయన మాటల్లోనే..

police
police

విజయనగరం జిల్లాలోని పార్వతీపురం సమీపంలో ఉన్న గుణానుపురం మా స్వగ్రామం. మా అమ్మ పేరు మహాలక్ష్మి, తండ్రి సత్యంనాయుడు. నాకు ఒక అన్న పేరు శంకర్‌రావు ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. మాకు గ్రామంలో ఆరు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయమే మాకు జీవనాధారం. వ్యవసాయం చేసి మా తల్లిదండ్రులు మా ఇద్దరినీ చదివించారు. మేము నాన్నతో పాటు పొలం పనులు చేసేవాళ్లం. ప్రభుత్వ హైస్కూళ్లో 10వ తరగతి వరకు చదివాను.

విజయవాడలోని గౌతమ్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశాను. గౌహతిలోని ఐఐటీలో డిగ్రీ చదివాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నాను. కుటుంబ పరిస్థితుల ప్రభావంతో సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యాను, గ్రూప్స్‌లో మంచి ర్యాంక్‌ రావడంతో ఇష్టమైన పోలీసు శాఖలో చేరాను. 2018 బ్యాచ్‌లో డీఎస్పీగా ఎంపికై అనంతపురంలోని పీటీసీలో శిక్షణ పొందానని ప్రసాదరరావు తెలిపారు.అనంతరం ప్రాక్టికల్ ట్రైనింగ్ ను కడపలో పూర్తి చేసుకుని రాయచోటి, రైల్వోకోడూరు, పులివెందుల, పోరుమామిళ్లలో ట్రైనీ డీఎస్పీగా విధులు నిర్వర్తించినట్లు వెల్లడించారు. ఆ సమయంలో జిల్లాపై మంచి అవగాహన పట్టు సాధించినట్లు తెలిపారు.

పోలీసులు అంటే ప్రజలకు చాలా మట్టుకు భయం.. వాళ్లతో పెట్టుకునే లేనిపోని గొడవ ఎందుకు అనే భావన. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టాలని ప్రజలకు  విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి చెప్పండి. నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ మా విధానం. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారు. సబ్‌డివిజన్‌లోని అన్ని గ్రామాలు తిరిగి తానే స్వయంగా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తా అని డీఎస్పీ ప్రసాదరావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news