ప్రపంచ దేశాలను కంటికి కనిపంచకుండా గడగడలాడిస్తున్న కరోనా నేటితో పుట్టి ఏడాది పూర్తి చేసుకుంది. అంటే చైనాలో మొదటి కేసు నమోదైంది ఈరోజే. కాబట్టి కరోనా నవంబర్ 17, 2020న మొదటి పుట్టిన రోజు జరుపుకుంటోంది. కానీ, ఈ వైరస్ ఎప్పుడు వెలుగు చూసిందోనని భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. హాంకాంగ్ పత్రిక ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపిన వివరాల ప్రకారం.. 2019 నవంబర్ 17న చైనాలోని హుబీ ప్రావిన్స్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి మొట్ట మొదట కరోనా సోకినట్లు గుర్తించారు. ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి దేశాధినేతల వరకు ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి వల్ల ఇప్పటి వరకు మొత్తం దాదాపు 13.3 లక్షల మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది.
కరోనా వెలుగుచూసిన తొలినాళ్లలో రోజుకు గరిష్టంగా ఐదు కేసులు నమోదయ్యేవి. గత ఏడాది డిసెంబరు 15 నాటికి మొత్తం కేసులు 27 మాత్రమే. చాలా మంది వైద్యులు అవన్నీ మామూలు వైరస్ కేసులేనని పొరపడ్డారు. ఆ నెల 27న హుబెయ్‌లోని ఒక వైద్యుడు మాత్రం ఇది కొత్తరకం వైరస్ అయి ఉండవచ్చని భావించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కరోనా అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది.
మొట్టమొదటగా ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి ప్రస్తుత స్థితిని తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ఉత్సాహం చూపిస్తున్నారు. తద్వారా అసలు ఇది ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో తెలుసుకోవచ్చనేది వారి ఉద్దేశం. గబ్బిలం నుంచి గానీ, మరేదైనా జంతువు నుంచి గానీ ఇది మానవుల్లోకి ప్రవేశించి ఉంటుందనేది ఎక్కువ మంది నమ్మకం.
కరోనా వచ్చి సంవత్సరమైనా ఇంకా టీకా రాలేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోక వైపు వ్యాక్సిన్ తయారు చేయటం కోసం ఓ వైపు వైద్యరంగ నిపుణులు, కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కానీ, పూర్తి స్థాయి కరోనా టీకా ఇంకా విడదల కాలేదు. తుది దశ క్లినికల్ ట్రయల్స్ ముగిసిన తర్వాతే టీకా అందుబాటులోకి రానుంది.