అనంతపురంలో తీవ్ర విషాదం నెలకొంది. పాత మిద్దె కూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని కుందుర్పి మండలం రుద్రంపల్లిలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన గంగన్న, శ్రీదేవి, సంధ్యలుగా గుర్తించారు. ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా పురాతన ఇంట్లోని మిద్దె కూలినట్లు సమాచారం.
నిద్రలోనే కుటుంబంలోని వ్యక్తులంతా మృత్యు ఒడికి చేరుకున్నారు.మృతదేహాలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకున్నాయి. వాటిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించనున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.