ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకుందామని పవిత్రమైన శుక్రవారం మసీదుకి వెళ్ళారు. అందరూ కూర్చుని నమాజ్ చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా బాంబు పేలింది. అసలు ఎం జరుగుతుంది ఏంటి అనుకునే లోపే మృతదేహాలు, ఆర్త నాదాలు. ఎటు చూసినా పోగే, బయటకు వెళ్ళడానికి మార్గం కనపడలేదు. కాస్త పొగ తగ్గిన తర్వాత బయటకు వచ్చి చూస్తే మసీదు మొత్తం కూలిపోయింది.
ఈ విషాద ఘటన పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో చోటు చేసుకుంది. క్వెట్టాలో శుక్రవారం మసీదు కోసం వెళ్ళిన ముస్లింలను లక్ష్యంగా చేసుకుని బాంబు పేల్చారు. ఈ ఘటనలో 15 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
ప్రార్ధనలు చేసే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్టు అధికారులు వివరించారు. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేయలేదు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఓ పోలిస్ అధికారితో పాటు మసీద్ ఇమామ్ ఉన్నారు. పేలుడు తర్వాత పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.