టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవలే నూతన కేబుల్ చార్జిల విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం విదితమే. కాగా ఈ విధానం అమలు చేసేందుకు గాను వినియోగదారులు తమకు కావల్సిన చానల్స్‌ను ఎంపిక చేసుకునే గడువును ట్రాయ్ ప్రస్తుతం పొడిగించింది. ఈ క్రమంలో చానల్స్ ఎంపికకు కస్టమర్లకు మార్చి 31, 2019 వరకు డెడ్‌లైన్ విధించింది. ఆలోగా దేశంలో ఉన్న టీవీ వీక్షకులు తమ కేబుల్ ఆపరేటర్ అందిస్తున్న ప్లాన్లకు అనుగుణంగా లేదా తమకు నచ్చిన చానల్స్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈ గడువు జనవరి 31వ తేదీ వరకు మాత్రమే ఉండగా, ఇప్పుడు దాన్ని మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు.
దేశంలో ప్రస్తుతం కేబుల్ సర్వీసులను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య 100 మిలియన్లు ఉండగా, డీటీహెచ్ సర్వీసులను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య 67 మిలియన్లు ఉంది. కాగా కొందరు వినియోగదారులు తమ కేబుల్ ఆపరేటర్ సూచించిన ప్రకారం చానల్స్‌ను ఎంపిక చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. స్థానికంగా ఉండే కేబుల్ ఆపరేటర్లు చానల్స్ ఎంపిక విషయంలో వినియోగదారులకు అవగాహన కల్పించలేదు. దీంతో వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చానల్స్ ఎంపికకు మరింత గడువు ఇచ్చినట్లు ట్రాయ్ తెలిపింది.
కాగా వినియోగదారులు తమకు కావల్సిన చానల్స్‌ను ఎంపిక చేసుకునే వరకు కేబుల్ ఆపరేటర్లు పాత ప్లాన్లనే కొనసాగించాలని, సేవలను నిలిపివేయరాదని కూడా ట్రాయ్ సూచించింది. ఈ క్రమంలోనే కస్టమర్లకు బెస్ట్ ఫిట్ ప్లాన్లను కూడా అందివ్వాలని ట్రాయ్ తెలిపింది. కాగా చాలా వరకు కేబుల్ ఆపరేటర్లు రూ.130కే 100 చానల్స్‌ను నూతన కేబుల్ చార్జిల విధానం ప్రకారం అందిస్తున్నాయి. అయితే కస్టమర్లు మాత్రం తాము చూడాలనుకుంటున్న చానల్స్‌కు విడివిడిగా లేదా చానల్స్ ప్యాకేజీని బట్టి డబ్బులు చెల్లించాలి.