కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట. అలా తయారైంది ప్రస్తుతం ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) పరిస్థితి. టీవీ ప్రేక్షకుల నెలవారీ కేబుల్ చార్జిలను తగ్గించాలనే ఉద్దేశంతో నూతన కేబుల్ టీవీ చార్జిల విధానాన్ని ట్రాయ్ ఈ నెల 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి తెచ్చింది. అయితే బ్రాడ్‌కాస్టర్లు, కేబుల్ ఆపరేటర్లు, డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ల పుణ్యమా అని ఇప్పుడు గతంలో కన్నా కేబుల్ టీవీ నెలవారీ చార్జిలు 25 శాతం వరకు పెరిగాయట. క్రిసిల్ అనే ఓ సంస్థ తన నివేదికలో తాజాగా ఈ వివరాలను వెల్లడించింది.
గతంలో కేబుల్ ఆపరేటర్లు, డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లు సౌత్‌కు ఒక ప్లాన్, నార్త్‌కు ఒక ప్లాన్, స్పోర్ట్స్‌కు ఒక ప్లాన్.. అని టీవీ ప్రేక్షకులకు పలు నెలవారీ ప్యాకేజీ టారిఫ్‌లను అందుబాటులో ఉంచారు. అలాగే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ రీచార్జిలను కూడా అందుబాటులో ఉంచారు. అయితే ఈ నెల 1వ తేదీ నుంచి ట్రాయ్ అమలులోకి తెచ్చిన నూతన కేబుల్ టీవీ చార్జిల విధానం వల్ల బ్రాడ్‌కాస్టర్లు తమ తమ చానల్స్‌కు గాను విడివిడిగా నెలవారీ చార్జిలను ప్రకటించారు. దీంతో చాలా వరకు టాప్ చానల్స్ ఇప్పుడు నెలకు రూ.19 నుంచి రూ.24 వరకు ఒక్క చానల్‌కు వసూలు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రేక్షకులకు తమకు కావల్సిన చానల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకుని వాటికి మాత్రమే డబ్బులు చెల్లించే వెసులుబాటు ఉంది. కానీ ప్రస్తుతం చానల్ చార్జిలను బ్రాడ్‌కాస్టర్లు పెంచారు. దీని వల్ల ప్రేక్షకులు తమకు కావల్సిన చానల్స్‌ను ఎంపిక చేసుకుంటే.. నెలకు అదనంగా 25 శాతం సొమ్ము చార్జిలకు చెల్లించాల్సి వస్తుందని క్రిసిల్ రిపోర్టు చెబుతోంది.
గతంలో నెలకు రూ.230-రూ.240 చెల్లించిన ప్రేక్షకులకు ఇప్పుడు నెలక రూ.300 పైనే అవుతున్నాయని కూడా క్రిసిల్ రిపోర్టులోవెల్లడించారు. దీని వల్ల బ్రాడ్‌కాస్టర్లకు 40 శాతం ఆదాయం పెరుగుతుందట. ఒక్కో సబ్‌స్క్రైబర్ నుంచి గతంలో బ్రాడ్‌కాస్టర్లకు రూ.60 నుంచి రూ.70 వరకు ఆదాయం వచ్చిందని, కానీ ఇప్పుడది ఏకంగా రూ.94కు చేరుకుందని క్రిసిల్ నివేదికలో ఇచ్చారు. ఈ క్రమంలోనే పాపులర్ చానల్స్‌ను ప్రసారం చేసే బ్రాడ్‌కాస్టర్లకు ఆదాయం మరింత పెరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక అంతగా పాపులర్ కాని, ఉచిత చానల్స్‌కు ఆదాయం నామమాత్రంగానే ఉంటుందని నివేదికలో వెల్లడించారు. దీన్ని బట్టి మనకు తెలుస్తుందేమిటంటే.. అంతిమంగా ట్రాయ్ అమలులోకి తెచ్చిన నూతన కేబుల్ టీవీ చార్జిల విధానం వల్ల వినియోగదారుల జేబులకు చిల్లు పడినట్లేనని తెలుస్తోంది. ఇది చివరకు ప్రముఖ బ్రాడ్‌కాస్టర్లకు, కేబుల్ ఆపరేటర్లు, డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లకు కూడా మేలు చేస్తుంది. మరి ట్రాయ్ భవిష్యత్తులోనైనా చానల్స్ వ్యక్తిగత చార్జిలను తగ్గించేలా చర్యలు తీసుకుంటుందా ? వినియోగదారులకు మేలు చేకూరుస్తుందా ? అంటే.. ఆ విషయం తేలాలంటే.. మరికొంత కాలం వేచిక చూడక తప్పదేమో..!