బౌద్ధమతం చాలా ప్రాచీనమైనది. గౌతమబుద్ధుడు స్థాపించిన ఈ మతాన్ని ఆరాధించే వాళ్ళు ఆచరించే వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. బీహార్ లోని గయ ప్రాంతంలో బోధి చెట్టుకింద జ్ఞానోదయం పొందిన బుద్ధుడు, వారణాసిలో తన మొదటి ఉపన్యాసాన్ని ఇచ్చాడు. సత్యం, అహింస, కోరికలు లేకపోవడం బౌద్ధమతంలోని ప్రధాన ఆచారాలు. ఐతే ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధమత దేవాలయాలు చాలా ఉన్నాయి. మనదేశంలోనూ చెప్పుకోదగ్గ దేవాలయాలు ఉన్నాయి. ఒకసారి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
మహాబోధి ఆలయం- బీహార్
బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ఈ ఆలయం ప్రపంచంలో బౌద్ద క్షేత్రాలన్నింటిలోకి చెప్పుకోదగినది. ఆ ప్రాంతంలో అలనాటి బోధి వృక్షాన్ని చూడవచ్చు. ఈ ఆలయాన్ని అశోకుడు నిర్మించాడు. పసుపు రంగులో బుద్ధ విగ్రహం ఉంటుంది.
సారనాథ్ ఆలయం- వారణాసి
బుద్ధుడు మొదటి ఉపన్యాసం ఇచ్చిన ప్రాంతం ఇది. ఈ దేవాలయాన్ని అశోకుడు నిర్మించాడు. చౌఖండి స్థూపం, మూల్గంధ కుటి విహార్, ధమేక్ స్థూపం, ధర్మరాజ స్థూపం సందర్శించాల్సిన ప్రదేశం.
ద వాట్ థాయ్ ఆలయం- కుషినగర్
ఈ ఆలయం ధ్యానం చేసుకునే వారికి చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ఉన్న ప్రత్యేక ప్రార్థన మందిరంలో ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు.
మహాపరినిర్యాణ ఆలయం-కుషినగర్
బుద్ధుడి అనుచరులలో ఒకరైన హరిబాలా ఈ ఆలయాన్ని నిర్మించాడు. అందమైన వాస్తుశిల్పం ఎర్ర ఇసుకరాయితో ఉన్న నిర్మాణాలు చూపరులను ఆకట్టుకుంటాయి.
రెడ్ మైత్రేయ ఆలయం– లేహ్
హిమాలయ పర్వతాల నడుమ 49అడుగుల ఎత్తున్న బుద్ధ విగ్రహం ఇక్కడ ప్రత్యేకత. ప్రపంచ నలుమూలల నుండి ఇక్కడకు పర్యాటకులు వస్తుంటారు.
గోల్డెన్ పగోడా ఆలయం-అరుణాచల్ ప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్ లోని నామ్సాయ్ జిల్లాలో 20 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ పది గోపురాలు. 2010లో వీటిని నిర్మించారు.
థెరావాడ బౌద్ధ దేవాలయం, ఈటానగర్
ధ్యానం చేయడానికి మరో గొప్ప ప్రదేశం థెరవాడ బౌద్ధ దేవాలయం. ఈశాన్య రాష్ట్రంలోని ఈ దేవాలయం ప్రకృతి అందాలతో కళకళలాడుతుంది.