త్రివేండ్రంలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ట్రివేండ్రంకు చెందిన విద్యార్థులు అద్భుతం సృష్టించారు. గోడలపైకి ఎక్కే రోబోను తయారు చేశారు. ఈ క్రమంలో వారు దానికి గాను తాజాగా పేటెంట్ కూడా పొందారు. సదరు రోబో నేల మీద వెళ్లినంత సులభంగా గోడలపై ఎక్కుతూ వెళ్లగలదు. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని దాన్ని తయారు చేసిన విద్యార్థులు చెబుతున్నారు.
ఆ విద్యార్థులు రూపొందించిన ఆ రోబో డక్ట్ ఫ్యాన్ మెకానిజంతో పనిచేస్తుంది. అందువల్ల దీని తయారీకి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ రోబో సహాయంతో భారీ కాంక్రీట్ నిర్మాణాలను సులభంగా తనిఖీ చేయవచ్చు. ప్రస్తుతం అలాంటి నిర్మాణాలను తనిఖీ చేయాలంటే మ్యాన్ పవర్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రోబో సహాయంతో ఆ పనిని చాలా తేలిగ్గా చేయవచ్చు. అందుకుగాను రోబోకు కెమెరాను అమర్చి దాన్ని రిమోట్‌గా కంట్రోల్ చేస్తూ ఎప్పటికప్పుడు నిర్మాణాలకు చెందిన దృశ్యాలను వైర్‌లెస్ రూపంలో స్వీకరించి వాటిని చూడవచ్చు. ఈ క్రమంలో ఎక్కడైనా నిర్మాణ లోపం ఉంటే వెంటనే ఆ దృశ్యాల సహాయంతో అక్కడికి చేరుకుని దానికి మరమ్మత్తులు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఈ రోబో వల్ల భారీ నిర్మాణాలను చాలా సులభంగా తనిఖీలు చేయవచ్చని సదరు విద్యార్థులు తెలిపారు. దీనికి గారు వారు తాజాగా పేటెంట్‌ను పొందారు. ప్రస్తుతం ఈ రోబోకు వారు మరిన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారు. త్వరలోనే దీన్ని వాణిజ్య పరంగా వినియోగంలోకి తేనున్నారు. దీన్ని చూడాలంటే సదరు కాలేజీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాన్ని సందర్శించవచ్చు. 2014 నుంచి ఈ ప్రాజెక్టును చేపట్టి ఇప్పటికి సక్సెస్ అయ్యామని వారు తెలిపారు.