ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఆ యువ నేత‌కేనా… అధిష్టానం సిగ్న‌ల్‌…!

ఏపీ రాజ‌కీయాల్లో బీజేపీ పాగా వేయాల‌నే ల‌క్ష్యంతో వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే జాతీయ స్థాయి నాయ‌కుడు, రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌.. సునీల్ దేవ్‌ధ‌ర్ రెండు నెల‌లుగా ఏపీలోనే ఉండి.. ఇక్కడి రాజ‌కీయా ల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఏ పార్టీ దూకుడుగా ఉంది. ఏ పార్టీపై తాము ఆదిప‌త్యం సాధించాలి. ఏ పార్టీని నిర్వీర్యం చేయాలి? అనే విష‌యాల‌ను సంపూర్ణంగా అధ్యయ‌నం చేస్తున్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్రంలో బీజేపీ దూకుడుపైనా ఆయ‌న సైలెంట్ అధ్య‌య‌నం చేస్తున్నారు. రాష్ట్రంలో యువత మెండుగా ఉన్న నేప‌థ్యంలో వారి ఓట్ల‌ను పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దీంతోపాటు.. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు సోము వీర్రాజు వైఖ‌రిపైనా సునీల్ దేవ్‌ధ‌ర్ దృష్టి పెట్టారు. ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలం నుంచి వ‌చ్చిన సోము.. పార్టీని న‌డిపించ‌డంలో మెరుపులు మెరిపిస్తార‌ని అనుకున్నా.. అనుకున్న విధంగా ఆయ‌న దూకుడు చూపించ లేక పోతున్నార‌ని పార్టీ నేత‌లు ఓ అభిప్రాయానికి వ‌చ్చారు. పైగా గ‌తంలో చాలా త‌క్కువ‌గా ఉన్న కుల రాజ‌కీయాలు పార్టీలో ఇటీవ‌ల కాలంలో పెరిగిపోయాయి. ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గం పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీనికి సోము న‌డ‌వ‌డే కార‌ణ‌మ‌నే ఫిర్యాదులు అందాయి. ఏతా వాతా ఎలా చూసినా..వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం సాధించాలంటే.. సోము వ‌ల్ల కాద‌ని తేల్చేశారు.

ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే పార్టీ ప‌గ్గాల‌ను యువ నేత‌కు అప్ప‌గించాల‌ని సునీల్ దేవ్‌ధ‌ర్‌.. కేంద్ర బీజేపీ నాయ‌క‌త్వానికి లేఖ రాసిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న రాయ‌ల‌సీమ‌లో పార్టీ ఎదిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉందని, ఇక్క‌డ న్యాయ రాజ‌ధాని ఏర్పాటుకు బీజేపీ మ‌ద్ద‌తిస్తున్న ద‌రిమిలా.. పార్టీ పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని .. ఈ నేప‌థ్యంలో యువ‌త‌కు ప‌గ్గాలు ఇస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్ర‌భావం ప‌డుతుంద‌ని కూడా దేవ్‌ధ‌ర్ త‌న లేఖ‌లో పేర్కొన్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే సీమ ప్రాంతానికి చెందిన బీజేపీ యువ నాయ‌కుడు స‌త్య‌కుమార్‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాలని ఆయ‌న సూచించిన ట్టు తెలుస్తోంది. అయితే, ఇప్ప‌టికిప్పుడే కాక‌పోయినా.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ తిరుపతి ఉప ఎన్నిక‌లో బీజేపీ పుంజుకోక‌పోతే.. సోమును త‌ప్పిస్తార‌ని అంటున్నారు.