ఈ హెడ్డింగ్ నిజమే.. తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు పరీక్షలు రాస్తున్నారు. ఎమ్మెల్యే అంటే సహజంగానే తెల్ల ఖద్దరు బట్టలు వేసుకుని ప్రజల్లోనో లేదా అసెంబ్లీలో కనిపిస్తుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే అందుకు భిన్నంగా కుర్రాడిలా టీ షర్టు వేసుకొని వచ్చిన పరీక్ష రాశారు. ఇలా ఆయన్ను చూసిన వారంతా వావ్ అంటూ చర్చించుకున్నారు. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి.
ఆర్మూర్ నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మిగిలిన ఎమ్మెల్యేలకు భిన్నంగా ఎమ్మెల్యే అయ్యాక కూడా చదువు మీద తనకున్న ఆసక్తిని కోల్పోలేదు. కాకతీయ వర్సిటీలో ఎల్ ఎల్ ఎం చేస్తున్న జీవన్‌రెడ్డి పరీక్షలు రాశారు. అయితే ఇలా ఎమ్మెల్యేలుగా ఉన్న వారు పరీక్షలు రాయడం కొత్తేం కాదు… గతంలో చాలా మంది ఇలాగే చేశారు. అయితే జీవన్‌రెడ్డి కుర్రాడిలా టీ షర్టుతో వచ్చి పరీక్షలు రాయడం కాస్త డిఫరెంట్. ప్రస్తుతం హన్ముకొండలోని ఆదర్శ లా కాలేజీలో ఎల్ఎల్ఎం ఫైనల్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి.
ఓ వైపు కుర్ర ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన అటు ప్రజాసేవతో పాటు ఇటు ఖాళీ ఉన్నప్పుడు చాలా సీరియస్‌గా తన చదువు కంటిన్యూ చేస్తున్నారు. శుక్రవారం క్యాంపస్‌లోని దూరవిద్యా కేంద్రం భవనంలో నిర్వహించిన ఎల్‌ఎల్‌ఎం ఫైనలియర్ రెండో పేపర్ ఇన్సూరెన్స్ లా పరీక్షను ఆయన రాశారు. ఏదేమైనా అటు ఎమ్మెల్యేగా ఉండడంతో పాటు ఇటు చదువుకుంటోన్న జీవన్‌రెడ్డి చాలా మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు.