ఆ ఎంపీ పేరు చెబితే సొంత పార్టీ కేడర్ కూడా ఆసక్తి చూపడం లేదట..ఇక ఆ ఎంపీ తన పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో అడుగుపెట్టాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవాలట..బీబీ పాటిల్ జహీరాబాద్ లోక్‌సభ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. అయినా కొన్ని నియోజకవర్గాల్లో అడుగుపెట్టాలంటే ఎంపీ హమ్మో అంటున్నారట. అక్కడి ఎమ్మెల్యేలు అనుమతి ఇవ్వందే ఎంపీ అడుగుపెట్టలేని పరిస్థితి ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే కేడర్ కూడా ఎంపీ గారి పేరు చెబితే ఆమడ దూరం జరుగుతున్నారట..సీఎం సొంత జిల్లా పరిధిలోని జహీరాబాద్ ఎంపీ పాటిల్ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
జహీరాబాద్‌లో తొలిసారి భారీ మెజారిటీతో గెలిచిన పాటిల్.. రెండోసారి అతి కష్టంమీద గట్టెక్కారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాదనే ప్రచారం కూడా జరిగింది. టీఆర్‌ఎస్ రిలీజ్ చేసిన మొదటి లిస్ట్‌లో పాటిల్ పేరు లేదు. దీంతో ఆయన టెన్షన్ పడ్డారని అనుచరులు ఇప్పటికీ చెప్పుకొంటారు. కేసీఆర్, కేటీఆర్, కవితలను పదే పదే కలిసి టికెట్‌పై క్లారిటీ తెచ్చకున్నారంటారు. చివరకు టికెట్ వచ్చినా.. ఫలితాల రోజు అంతే టెన్షన్ పడ్డారు పాటిల్. లాస్ట్ రౌండ్ ఓట్ల లెక్కింపు వరకూ ఫలితం నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఒకానొక సందర్భంలో పాటిల్ ఓడిపోతారనే ప్రచారం జరిగింది. చివరకు స్వల్ప మెజారిటీతో గెలిచి ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలు సహకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంతా అనుకున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో ఎంపీకి వచ్చిన గ్యాప్ పూడ్చడం కష్టమేనని పార్టీ నేతలు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ఎంపీ పాటిల్ పెద్దగా పర్యటించిన ఉదంతాలు లేవు. తొలిసారి ఎంపీ అయినప్పుడు ఈ నియోజకవర్గాలకు వచ్చినా.. రెండోసారి ఎంపీ అయిన తర్వాత రావడమే మానేశారట. జిల్లా స్థాయి సమావేశాలకు రెగ్యులర్‌గా వచ్చిన సందర్భాలు కూడా లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పాటిల్ ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆ ఎమ్మెల్యేలతో దూరం అలాగే ఉందట. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ఎంపీని ఆహ్వానించడం లేదట. ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదని సమాచారం. ఇది పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నియోజవర్గానికి ఒకరు చొప్పన తన మనుషులను పెట్టుకుని వారితోనే కథ నడిపిస్తారని లోకల్‌గా బాగా ప్రచారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సదరు ఎమ్మెల్యేలకు ఎంపీ పాటిల్ సహకరించలేదనే వాదన ఉంది. అందుకే ఎంపీ ఎన్నికల్లో రివెంజ్ తీర్చుకున్నారని.. నాటి నుంచి కోల్డ్ వార్ అంతకంతకూ పెరుగుతోందని అంటున్నారు.
ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని ఓ వర్గం పార్టీ పెద్దలను గట్టిగానే కోరిందట. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి లీడ్ రావడాన్ని ప్రత్యేకంగా చెబుతుంటారు. ఆయా నియోజకవర్గాల్లోని కార్యకర్తలు కూడా ఎమ్మెల్యేలకు తెలియకుండా ఎంపీతో మాట్లాడితే ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని పాటిల్‌కు దూరంగా ఉంటున్నారట. ఈ విషయం పార్టీ పెద్దల దృష్టిలోనూ ఉంది. మరి.. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య రాజీ చేస్తారో.. కాలమే సమాధానం చెబుతుందని సైలెంట్‌గా ఉంటారో చూడాలి.