స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఇందులో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే గోపినాథ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కవిత రక్తదానం చేశారు. సనత్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందని తెలిపారు.
రక్తం అవసరం ఎప్పుడైనా తలెత్తొచ్చని.. ప్రమాదాల్లో గాయపడటం, శస్త్రచికిత్సలు, కాన్పు సమయంలో రక్తస్రావం వంటి సందర్భాల్లో అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వస్తుందని అందుకే రక్తదానం చేయడానికి అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. రక్తం ఎక్కువగా పోయినప్పుడు హిమోగ్లోబిన్ మోతాదులు వేగంగా పడిపోతాయని.. అప్పుడు సత్వరం రక్తం ఎక్కించకపోతే ప్రాణాల మీదికి రావొచ్చని అన్నారు.
సర్జరీలు.. ముఖ్యంగా కడుపు, గుండె శస్త్రచికిత్సల్లో ఎక్కువ రక్తం పోతుంటుందని.. వీరికీ రక్తం అవసరమని అందుకే రక్తదానం చేయాలని చెప్పారు. తలసీమియా, సికిల్ సెల్, ఎప్లాస్టిక్ ఎనీమియా, మైలోడిస్‌ప్లాస్టిక్ సిండ్రోమ్, పాంకోనీ అనీమియా వంటి జబ్బులతో బాధపడేవారికి రక్తం చాలా అవసరం ఉంటుందని అన్నారు. రక్తదానం చేసి అలాంటి వారి ప్రాణాలు కాపాడాలని కవిత కోరారు.