మొత్తానికి తాను పెట్టబోయే కొత్త పార్టీ పేరుపై గులాబీ బాస్ ఎట్టకేలకు సస్పెన్స్ కు తెరదించినట్లుగా కనిపిపిస్తోంది. ప్లీనరీలో అధ్యక్ష ప్రసంగం చేస్తూ దేశ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ పేరుపై తన మనసులో మాటను బయటపెట్టినట్లుగా తెలుస్తోంది.
ఫెడరల్ ఫ్రంట్.. థర్డ్ ఫ్రంట్.. ఏర్పాటుకు అడుగులు ముందుకు పడకపోవడం.. కాంగ్రెస్ లేని కూటమికి బీజేపీయేతర పార్టీలు అంగీకరించకపోవడం.. వంటి పరిస్థితుల నేపథ్యంలో.. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే కొత్త పార్టీ పెడుతామని, పెడితే తప్పేముందని కూడా ప్రశ్నించారు. అప్పటి నుంచి కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడుతారని, ఆ దిశగా అడుగులు వేస్తున్నారని వార్తలు వచ్చాయి.
ఒక కేసీఆర్ జన్మదినం సందర్భంగానూ దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా గుజరాత్, ఉత్తరప్రదేశ్ లోనూ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హోర్డింగులు వెలిశాయి. అందులో దేశ్ కీ నేతకేసీఆర్ అంటూ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గంలోనూ సీఎం కేసీఆర్ హోర్డింగ్లు ఏర్పాటు చేయడం రాజకీయంగా ఆసక్తిని కలిగించింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తాజాగా ప్లీనరీలో జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని అందరూ భావించారు. ఈ మేరకు పార్టీ నాయకులు కూడా ఊహించారు. అయితే.. దీనిపై కేసీఆర్ ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయకపోయినా.. భవిష్యత్తుకు సంబంధించి సంకేతాలు అందించారు. ప్లీనరీ తీర్మానంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో.. ఫ్రంట్, కూటమి వంటి ఏర్పాట్లకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఎవరినో గద్దెనెక్కించడానికి… దించడానికి ప్రయత్నాలు జరగాలా.? అంటూ ప్రశ్నించారు.
” దేశం బాగుపడటానికి మన రాష్ట్రం వేదికైతే అది మనందరికీ గర్వకారణం. దేశాన్ని సరైన పంథాలో నడిపించేందుకు ఓ కొత్త ప్రతిపాదన, ఎజెండా సిద్ధమైతే మన రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం. తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితి రావాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి” అని వెల్లడించారు.
అయితే ఈ పేరును ఆయన ఆషామాషీగా ప్రస్తావించబోరని, అందరి ఆమోదం మేరకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని రాజకీయ పండితులు అంటున్నారు. భవిష్యత్తులో కొత్త పార్టీ పెడితే దాదాపు ఇదే పేరు ఖరారు కావొచ్చని అంచనా వేస్తున్నారు.