బంతిపూల సాగులో సస్యరక్షణ చర్యలు.. మేలైన విత్తన రకాలు..

-

బంతిని ఏ కాలంలో అయినా.. ఎలాంటి ప్రాంతంలో అయినా.. సాగు చేసుకోవచ్చు. బంతిపూల తోట చూడ్డానికి ఎంతో అందంగా.. మనసుకు భలే ప్రశాంతంగా కనిపిస్తుంది. వాతావరణ పరిస్ధితులను బట్టి జులై మొదటి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకుంటే అక్టోబరు నుండి ఏప్రిల్ వరకు పూల దిగుబడి వస్తుంది. వర్షకాలంలో వర్షాల కారణంగా పూల నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది.. మరి ఈ సాగులో.. కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే.. తెగులు సమస్య వస్తుంది. ఈరోజు మనం బంతి సాగులో ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలో చూద్దాం.

ఆఫ్రికన్ మేరీ గోల్డ్..

బంతిలో వాణిజ్య పరంగా సాగు చేసేందుకు రెండు రకాలు ఉన్నాయి. ఆఫ్రికన్ మేరీ గోల్డ్ రకానికి సంబంధించి మొక్కలు ఎత్తుగా పెరిగి పెద్ద సైజులో పూలు పూస్తాయి. దీనిలో ఆఫ్రికన్ జెయింట్ ఆరెంజ్ డబుల్, ఆఫ్రికన్ ఎల్లో జెయింట్ డబుల్, క్రాక్ జాక్, గోల్డెన్ ఏజ్ రకాలు అనువైనవి.

ఫ్రెంచ్ మేరీ గోల్డ్..

ఫ్రెంచ్ మేరీ గోల్డ్ ఇది పూల కుండీల్లో పెంచే పొట్టి సైజు రకం. దీనిలో రెడ్ బ్రోకెడ్, రెస్పిన్ రెడ్, బట్టర్ స్కాబ్, వాలెన్షియా రకాలు అనువైనవి. బంతిని మిరప, పత్తి, తదితర పంటల్లో రక్షక పంటగా సాళ్లల్లో పెంచుకోవచ్చు. బంతిని విత్తనం ద్వారా, కత్తిరిపులు నాటి కానీ ప్రవర్ధనం చేయవచ్చు. ఎకరానికి నారు పెంచటానికి 800గ్రా విత్తనాలు అవసరం అవుతాయి.

బంతి సాగులు తెగుళ్లు.. నివారణ చర్యలు..

మొగ్గతొలిచే పురుగు: లార్వాలు పూ మొగ్గలను తొలుస్తాయి. దీంతో పూ మొగ్గలు విచ్చుకోవు. పూల దిగుబడి బాగా తగ్గుతుంది. నివారణకు కార్బరిల్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పేను పురుగు: పెద్ద, పిల్ల పురుగులు పూ మొగ్గల్ని ఆశించి నష్టపరుస్తాయి. నివారణకు లీటరు నీటికి మలాథియాన్ 2మి.లీ లేదా డైమిథోయేట్ 2.మి.లీ 15 రోజుల వ్యవధిలో పిచికారి చేసి నివారించవచ్చు.
నారుకుళ్లు తెగులు: నేలలో తేమ ఎక్కువగా ఉండి వెచ్చని వాతావరణంలో ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. మొలకెత్తిన నారు మొక్కల కాండం కుళ్లి చనిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 2గ్రాముల కాప్టాన్ లేదా 1.5గ్రా కార్బండిజం కలిపిన మందు ద్రావణంలో నారుమడిని తడిపి నివారించవచ్చు.
తామర పురుగులు: పిల్ల, తల్లి పురుగులు ఆకులు, పూల నుండి రసాన్ని పీలుస్తాయి. ఆకులు మీద తెల్లని మచ్చలు కనిపిస్తాయి. ఇవి ఆశించిన పూ మొగ్గలు గోధుమ రంగు మారి ఎండిపోతాయి. నివారణకు డైమిథోయేట్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పూలు కోసే పద్దతి..

బాగా విచ్చుకున్న పువ్వులను కోయాలి. ఉదయం , సాయంత్రం సమయంలో మాత్రమే పూలను కోయాలి. కోతకు ముందు నీటి తడి ఇస్తే పూలు కోత తరువాత ఎక్కువ కాలం తాజాగా ఉండి నిల్వ ఉంటాయి. సకాలంలో పూలకోతలు చేస్తూ ఉంటే పూల దిగుబడి పెరుగుతుంది. సాధారణంగా ఎకరాకు 4 నుండి 5 టన్నుల పూల దిగుబడి వస్తుంది.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. బంతిపూల సాగులో మంచి దిగుబడి పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version