తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌తోపాటు నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు మార్చి 14న పోలింగ్ జరుగుతుంది. ఈ రెండు చోట్లా టీఆర్‌ఎస్ అభ్యర్థులను బరిలో దించింది. నామినేషన్ల దాఖలు ఘట్టం పూర్తికావడంతో ప్రధాన పార్టీలు గేర్ మార్చాయి. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక చర్చలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై వాడి వేడిగా చర్చలు నడుస్తున్న సమయంలో టీఆర్ఎస్ మళ్లీ కొత్త ప్యూహానికి తెర లేపింది
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వివిధ అంశాలపై రాజకీయ పార్టీలు ఎవరి వాదన వారు బలంగా వినిపించే పనిలో ఉన్నాయి. ఇదే సమయంలో న్యూస్ చానళ్లలోనూ చర్చల వేడి రాజుకుంటోంది. ఇన్నాళ్లూ చర్చా వేదికలపై పాల్గొనేందుకు దూరంగా ఉన్న టీఆర్‌ఎస్ నేతలు ఇక బస్తీమే సవాల్ అని తొడ కొడుతున్నారు. టీవీ చర్చల్లో పాల్గొనేందుకు చాలారోజుల గ్యాప్ తర్వాత పార్టీ నేతలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది టీఆర్ఎస్ అధిష్టానం.
సీఎం కేసిఆర్ ఆదేశాలతో కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు టీవీ చర్చలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యమైన సందర్భాలలో మాత్రమే పార్టీ వాదనలు వినిపిస్తున్నారు నాయకులు. ఎవరు పడితే వాళ్లు టీవీ చర్చలకు వెళ్లి టీఆర్‌ఎస్ వాదన సరిగ్గా వినిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తంకావడంతో అప్పట్లో కేసిఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వైఖరి మార్చుకోవడంతో.. చర్చలకు ఎవరు వెళ్లాలి.. ఏంటన్నదాని పై ఒక జాబితా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అయితే ఆ జాబితాలో ఎవరి పేరు ఉంటుందన్నది ఇంకా ప్రకటించలేదు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్‌ఎస్ కీలకంగా భావిస్తోంది. పార్టీ వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే యోచనలో ఉంది. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తావించాల్సిన అంశాలను వివరిస్తూ..టీవీ చర్చల్లో పాల్గొనాలని సూచించారట. దీంతో ఇలాంటి అధికారిక ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న ఔత్సాహిక టీఆర్‌ఎస్ నేతలు మేం రెడీ అంటున్నారు. అవకాశం వస్తే టీవీ చర్చల్లో పాల్గొని పార్టీ వాదనను బలంగా వినిపించి అధిష్ఠానం దృష్టిలో పడాలనే ఆలోచనలో మరికొందరు నేతలు ఉన్నారట.
చర్చల్లో టీఆర్‌ఎస్ వాదన లేకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించారో ఏమో.. కౌంటర్లు ఇవ్వడానికి.. చేసింది చెప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు గులాబీ నేతలు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే వారంతా డిగ్రీ ఆపై చదువులు చదువుకున్నవారే. వారిని ఆకర్షించడం.. ప్రభుత్వ, పార్టీ వాదనను బలంగా వినిపించడం ముఖ్యం. అందుకే గులాబీ దళం వ్యూహం మార్చినట్లు తెలుస్తుంది.