కారుకు వరుస షాకులు తగలడం మొదలయ్యాయి..మొన్నటివరకు అధికార బలంతో తిరుగులేని స్థానంలో ఉన్న గులాబీ పార్టీలో గుబులు మొదలైంది…అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ పుంజుకోవడంతో టీఆర్ఎస్ లో టెన్షన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే టీఆర్ఎస్ బలం తగ్గుతూ వస్తుంది…ఇదే సమయంలో పార్టీలో ఆధిపత్య పోరు…ఇంకా డ్యామేజ్ చేస్తుంది…దానికి తోడు ఆధిపత్య పోరు ఎక్కువై…బడా నేతలు వేరే పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు..ఇప్పటికే పలువురు నేతలు కారుకు షాక్ ఇచ్చి, వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇంకా మరికొందరు కూడా పార్టీ మారేందుకు చూస్తున్నారు.
2014లో టీఆర్ఎస్ గెలిచినప్పుడు నాయకుల అవసరం ఉంది కాబట్టి..పార్టీలోకి కొత్త వాళ్ళు వచ్చిన ఇబ్బంది లేకుండా పోయింది. కానీ 2018లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాక కూడా…ఎక్కువ స్థాయిలో నేతలని పార్టీలోకి తీసుకొచ్చారు. దీని వల్ల ఎక్కడకక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైంది. ఇక ఈ పోరులో ఎక్కువ పవర్ ఉన్నవారు…మిగిలిన నేతలని సైడ్ అయ్యేలా చేస్తున్నారు.
ఇటీవల చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాల్క సుమన్ వల్లే ఓదేలు పార్టీని వీడారు. ఇక ఖైరతాబాద్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి మధ్య పోరు నడిచింది…ఇదే క్రమంలో విజయా రెడ్డి టీఆర్ఎస్ ని వదిలి కాంగ్రెస్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అటు ఆలేరులో ఎమ్మెల్యే సునీత వల్ల మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ పార్టీ మారిపోయారు.
ఇక తాజాగా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సైతం పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. గతంలో తాటి…టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేశారు…తర్వాత వైసీపీలోకి వచ్చి 2014లో అశ్వరావుపేట ఎమ్మెల్యేగా గెలిచి..టీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇక 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. అయితే మెచ్చా తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చారు. దీంతో తాటికి ప్రాధాన్యత తగ్గింది..ఈ క్రమంలోనే ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడేందుకు రెడీ అయ్యారు. అటు సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు సైతం కారుకు షాక్ ఇచ్చేలా ఉన్నారు.