అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందా అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. జార్జియా మరియు పెన్సిల్వేనియా లాంటి యుద్ధభూమి రాష్ట్రాలలో బిడెన్ ఆధిక్యంలోకి రావడంతో డోనాల్డ్ ట్రంప్ ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. “జో బిడెన్ ప్రెసిడెంట్ పదవిని అక్రమంగా చేపట్టవద్దు. నేను కూడా గట్టిగానే మాట్లాడగలను. చట్టపరమైన చర్యలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి!” అని ట్రంప్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
జార్జియా, నెవాడా, పెన్సిల్వేనియా, అరిజోనా మరియు నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ఇప్పటికీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఐదు యుద్ధభూమి రాష్ట్రాల్లో నాలుగు స్థానాల్లో జో బిడెన్ ముందున్నారు. కొన్ని లెక్కల ప్రకారం బిడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో ఉండగా, ట్రంప్ 214 వద్ద ఉన్నారు. యుఎస్ ఎన్నికల్లో విజేతగా ప్రకటించాలంటే, 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో కనీసం ఒకరికి 270 అవసరం.