అరటి ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు. దాన్లో ఉండే ఖనిజాలు, కాల్షియం మొదలగునవి శరీరానికి కావాల్సిన పోషకాలని అందిస్తాయి. ఐతే అరటి పండు శరీరానికి ఎంత మేలు చేస్తుందో అరటి తొక్క కూడా అంతే మేలు చేస్తుందన్నది మీకు తెలుసా? అవును అరటి తొక్క కారణంగా చర్మ సమస్యలు దూరం అవుతాయి. ముఖంపై ఉండే మచ్చలు అరటితొక్కతో దూరం అవుతాయి. అరటి తొక్కతో చర్మానికి ఎలా మేలు కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
అరటి తొక్క స్క్రబ్
అరటిలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, సి, ఈ పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల ముఖంపై ఏర్పడే చిన్న చిన్న మచ్చల నుండి మొటిమల వరకు దూరం అవుతాయి. దీనికోసం అరటి తొక్క స్క్రబ్ వాడాలి. 3టేబుల్ స్పూన్ల పంచదార, కొద్దిగా ఓట్ మీల్ పౌడర్, కొన్ని అరటి తొక్కలు తీసుకుని గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన పేస్టుని ముఖానికి అప్లై చేయాలి. అంతే ఇలా కొన్ని రోజుల పాటు చేస్తుంటే ముఖంపై మచ్చలు కనబడకుండా పోతాయి.
కళ్ళ కింద నల్ల చారలు పోగొట్టడానికి
అరటి తొక్కను తీసుకుని దానికి కొద్దిగా కలబంద కలుపుకుని పేస్ట్ సిద్ధం చేసుకోండి. ఆ పేస్టుని కళ్ళ కింద నల్లగా ఉన్న ప్రదేశాల్లో వర్తించండి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తుంటే నల్ల చారలు పోయి తెల్లగా మెరుస్తుంది.
ముఖం జిడ్డుగా ఉంటే,
ఆయిలీ స్కిన్ కారణంగా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దాన్నుండి బయటపడడానికి అరటి తొక్క సాయం చేస్తుంది. అరటి తొక్క లోపలి పొరకు నిమ్మకాయ, తేనె పూసి ముఖానికి రుద్దాలి. వారానికి రెండుసార్లు ఇది పాటిస్తే జిడ్డు చర్మం నుండి బయటపడవచ్చు.