తెలంగాణలో మద్యం దుకాణాలు కరోనా కేంద్రాలుగా మారాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం దుకాణాలు, పబ్‌లు, థియేటర్లలో రద్దీపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కాగా తెలంగాణలోని కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కరోనా మార్గదర్శకాల అమలుపై డీజీపీ హైకోర్టుకు నివేదిక సమర్పించారు.
కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి సుమారు 22వేల కేసులు నమోదు చేసినట్టు డీజీపీ నివేదికలో వెల్లడించారు. సోషల్ డిస్టెన్స్ పాటించని వారిపై 2,416 కేసులు, రోడ్లపై ఉమ్మి వేసిన వారిపై 6 కేసులు నమోదు చేశామని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పేర్కొంది. ఇక ఆర్టీపీసీఆర్ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు… కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్ పరీక్షలు 70 శాతం పెంచాలని సూచించింది.
కరోనా కట్టడికి లాక్‌డౌన్ అవసరం లేకపోయినా కంటైన్‌మెంట్ జోన్లు కచ్చితంగా ఉండాలని సూచించింది. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, దీని కోసం నిపుణులతో కమిటీ వేయాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వ్యాక్సినేషన్ ఏర్పాట్లు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించగా… దీనిపై కూడా హైకోర్టు ఆరా తీసింది. వ్యాక్సినేషన్ ఏర్పాట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. వీటన్నింటికి సంబంధించి ఏప్రిల్ 14లోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ… తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది.