తెలంగాణ ఆర్టిసిని భారీ నష్టాలు ముంచెత్తుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం లో ఇప్పటి వరకు రూ. 1,246 కోట్ల నష్టాలను ఆర్టీసి చవిచూసినట్టు తెలుస్తోంది. కాగా గతేడాది ఆర్టీసి కి రూ.1,424 కోట్ల నష్టం వచ్చింది. దాంతో గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది నష్టాలు కాస్త తగ్గాయని తెలుస్తోంది. ఇక ఆర్టీసి కి ఆగస్టులో రూ.172 కోట్ల నష్టం రాగా …సెప్టెంబర్ నెలలో రూ.209 కోట్ల నష్టం వచ్చింది. దసరా సీజన్ లో ఆర్టీసి కి లాభాలు వరిస్తాయని ఆశించినా అది కూడా జరగలేదు.
ఈ సీజన్ లో కూడా నష్టాల భాట పట్టింది. ఆర్టీసి అభివృద్ధి కి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నా…టికెట్ ధరలను పెంచుతున్నా గతం లో తీసుకున్న అప్పులు ఆర్టీసి కలవరపెడుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఏడాది కరోనా ప్రభావం కూడా ఆర్టీసి పై ఎక్కువే చూపించినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసి ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీపావళి పండుగ తరవాత మరోసారి చార్జీలను పెంచే ఆలోచన లో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.