తెలంగాణలో పదో తరగతి పరీక్షలు కరోనా కారణంగా 2 ఏళ్ల తర్వాత జరుగుతున్నాయి. గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులను చేశారు. కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో ఈసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు విద్యాశాఖ అధికారులు. రాష్ట్రంలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 23 నుంచి జూన్ 1 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.ఈసారి మొత్తం 5,09,275 మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్నారు. పదో తరగతి పరీక్షల కోసం తెలంగాణలో 2,861 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు విద్యాశాఖ అధికారులు.
ప్రతి పరీక్ష కేంద్రాలలో అధికారులు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షల సరళిని పర్యవేక్షించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రారంభం అయ్యాక 5 నిమిషాల వరకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించరు. కాగా ఈసారి 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి 6 పేపర్లు మాత్రమే ఉంటాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.