ఆశ వర్కర్లకు శుభవార్త.. డబ్ల్యూహెచ్‌వో పురస్కారం..

-

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆశ వర్కర్లకు శుభవార్త చెప్పింది. భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో విశేషమైన సేవలందిస్తున్న గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త(ఆశా)ల నెట్‌వర్క్‌కు ప్రపంచ గుర్తింపు లభించింది. మూడేళ్లుగా డబ్ల్యూహెచ్‌వో అందజేస్తున్న ‘డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్స్‌ గ్లోబల్‌ హెల్త్‌ లీడర్‌ అవార్డు’ భారత్‌లోని ఆశా నెట్‌వర్క్‌కు దక్కింది. ఆదివారం వర్చువల్‌గా జరిగిన సమావేశంలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రేయెసస్‌ ప్రకటించారు.

‘‘భారత్‌లో సుమారు 10 లక్షల మంది మహిళలతో ఆశా నెట్‌వర్క్‌ కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందిస్తోంది. కొవిడ్‌-19 కల్లోలం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఇంటింటికీ వెళ్లి.. బాధితులను గుర్తించింది. వైరస్‌ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు తీసుకుంది’’ అని డాక్టర్‌ టెడ్రోస్‌ వ్యాఖ్యానించారు. ‘‘హిందీ భాషలో ఆశా అంటే నమ్మకం అని అర్థం’’ అని వివరించారు. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 24న తాలిబాన్ల కాల్పుల్లో మృతిచెందిన 8 మంది పోలియో బృందం సభ్యులకూ ఈ అవార్డును ప్రకటించారు.

వ్యక్తిగత కేటగిరీలో.. హార్వర్డ్‌కు చెందిన డాక్టర్‌ పాల్‌ ఫార్మర్‌(మరణానంతరం), బ్రిటన్‌కు చెందిన లెబనాన్‌ సంతతి సైకియాట్రిస్టు డాక్టర్‌ అహ్మద్‌ హన్కీర్‌, కాబోవెర్దేకు చెందిన లుద్మిలా సోఫియా ఒలివెరియా, డబ్ల్యూహెచ్‌వో కుష్ఠు నివారణ విభాగానికి జపాన్‌ తరఫున రాయబారిగా ఉన్న యోహెయి ససవాకను అవార్డులకు ఎంపిక చేసినట్లు టెడ్రోస్‌ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version