తెలుగు మీడియా దిగ్గజం టీవీ9 సంస్థకు కొత్త సీఈవో వచ్చారు. జీ మీడియా సీఈవోగా గత ఐదేళ్లు పని చేసిన బరూన్ దాస్ టీవీ9 కొత్త సీఈవోగా నియమితులయ్యారు. అయితే ఇటీవల ఫోర్జరీ కేసులో అప్పటివరకూ సీఈవోగా కొనసాగిన రవి ప్రకాష్ ని తప్పించి మహేందర్ మిశ్రాని కొత్త సీఈవోగా నియమించిన విషయం తెలిసిందే. కానీ రెండు నెలలు పని చేసిన మహేందర్ ని తప్పించి ఇప్పుడు బరూన్ దాస్ ని నియమించారు.
అయితే రెండు నెలల్లోనే మహేందర్ ని ఎందుకు తప్పిచారో అనే విషయంపై మాత్రం క్లారిటీ రావట్లేదు. కానీ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం టీవీ9 రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిల్లో ఉండటంతో రెండు నెలల్లోనే మిశ్రాకు ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. పైగా కన్నడ చానల్ సీఈవోని నెంబర్1 గా నిలబెట్టినందుకు, సంస్థలో కీలక పాత్ర పోషించనందుకు ఒప్పందం ప్రకారం సంస్థ లాభాల్లో మిశ్రాకు 8.70 కోట్లు రావాల్సి ఉందని సమాచారం.
కానీ సంస్థ యజమాన్యం ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు ఇష్టం లేక మిశ్రాని బలవంతంగా బయటకు వెళ్లగొట్టిందని అంటున్నారు. ఇక ఇదే విషయంపై మిశ్రా ఆవేదన వ్యక్తం చేస్తూ ఎడిటర్ గిల్డ్ కు లేఖ కూడా రాశారని సమాచారం. కాగా, రవి ప్రకాష్ సీఈవోగా ఉన్న సమయంలో మిశ్రా జర్నలిస్టుగా ఉండేవారు. అయితే ఆయన కష్టాన్ని, నాయకత్వ లక్షణాలని గుర్తించి కన్నడ చానల్ బాధ్యతలు అప్పగిస్తూ సంస్థ లాభాల్లో వాటా ఆఫర్ చేశారు.
అయితే రవి ప్రకాష్ కేసులో చిక్కుకోవడంతో ఆయన పోస్టుని మిశ్రాకు ఇచ్చారు. ఇప్పుడు మిశ్రాని రెండు నెలలో తొలగించి బరూన్ దాసుకు బాధ్యతలు అప్పగించారు. మొత్తానికి రవిప్రకాశ్ సమయంలో బాధ్యతలు తీసుకున్న వారిని యజమాన్యం ఇలా బయటకు పంపుతోందని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.