జంట జలాశయాలకు ఉద్ధృతంగా వరద.. భయం గుప్పిట్లో స్థానికులు

-

నిర్విరామంగా కురుస్తున్న వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైపోతోంది. నగరంలో జంట జలాశయాలైన ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్​లలోకి భారీ వరద నీరు చేరుతోంది. ఉస్మాన్ సాగర్ ఇన్‌ఫ్లో 2వేల క్యూసెక్కులు కాగా.. నాలుగు గేట్ల ద్వారా 832 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1,786.65 అడుగులు వరకు నీరు చేరింది.

హిమాయత్‌సాగర్‌కు 500 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా.. రెండు గేట్ల ద్వారా 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1,760.50 అడుగులు మేర వరద నీరు చేరింది.

మరోవైపు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎప్పుడెప్పుడు పొంగిపొర్లుతుందా అన్నట్లు ఉంది హుస్సేన్ సాగర్ పరిస్థితి. భారీ వరద నీరు చేరడంతో హుస్సేన్ సాగర్​లో ప్రస్తుత నీటిమట్టం 513.70 మీటర్లకు చేరింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు. కూకట్​పల్లి నుంచి భారీగా హుస్సేన్​సాగర్​లోకి వరద నీరు చేరుతోంది.

నగరంలో కురిసిన భారీ వర్షాలకు జీడిమెట్ల పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువుకు భారీగా వరద వస్తోంది. చెరువుకు ఎగువన ఉన్న ఉమామహేశ్వరకాలనీ వాసులు మరోసారి భయం గుప్పిట్లో గడుపుతున్నారు. కొంపల్లి, దూలపల్లి, గుండ్లపోచంపల్లి నుంచి ఫాక్స్ సాగర్‌కు పెద్ద ఎత్తున వరద వస్తోంది. అలాగే దుండిగల్ మండల పరిధిలోని బహదూర్ పల్లి గ్రామంలోని బోభాఖాన్ చెరువు పూర్తిగా నిండిపోయి అలుగు పారుతుంది. దీంతో మున్సిపల్ అధికారులు పరిసర వాసులను అప్రమత్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version