‘నువ్వు బరువు తగ్గితే.. నీ నియోజకవర్గ అభివృద్ధికి కేజీకి రూ.వెయ్యి కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తా’ అంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మధ్యప్రదేశ్ ఎంపీ అనిల్ ఫిరోజియాకు ఛాలెంజ్ విసిరారు. తన కోసం మాత్రమే కాకుండా తన నియోజకవర్గం కోసం ఫిరోజియా కసరత్తులు ప్రారంభించారు. ఏడు నెలలు తిరిగేసరికల్లా 32 కిలోల బరువు తగ్గారు. ఫిబ్రవరిలో 127 కేజీలున్న అనిల్.. గత ఏడు నెలల్లో 32 కేజీలు తగ్గి 95 కేజీలకు చేరారు.
32 కిలోలు తగ్గడమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే రూ.2,300 కోట్లను రాబట్టారు. ఆహారంలో అనేక మార్పులు చేసి.. సైక్లింగ్, యోగా వంటి కసరత్తులు చేశానని ఎంపీ అనిల్ ఫిరోజియా తెలిపారు. ఈ ప్రయత్నం ఇంతటితో విరమించనని.. మరింత బరువు తగ్గి తన నియోజకవర్గానికి మరిన్ని నిధులు సాధిస్తానని చెప్పారు.
“కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన సవాల్‌ను నేను స్వీకరించి 32 కిలోలు తగ్గాను. తాజాగా మంత్రిని కలిసి ఈ విషయం చెప్పగా.. ఆయన ఎంతో సంతోషించారు. ఆయన నాకు హామీ ఇచ్చిన విధంగానే రూ. 2,300 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఆమోదం తెలిపారు.”
– అనిల్ ఫిరోజియా, ఉజ్జయిని ఎంపీ