రష్యా- ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం 12వ రోజుకు చేరింది. రష్యా ఉక్రెయిన్ ను నామరూపాలు లేకుండా దాడులు చేస్తోంది. ముఖ్యంగా ప్రధాన నగరాలే టార్గెట్గా చేసుకుంటూ దాడులు చేస్తోంది. రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ పై రాకెట్ల దాడితో విరుచుకుపడింది. ఇక మరో నగరం మరియోపోల్ ను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఒడిస్సా నగరాన్ని కూడా స్వాధీనం చేసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఖేర్సన్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది రష్యా.
ఇదిలా ఉంటే ఈరోజు మరోసారి బెలారస్ వేదికగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగనున్నాయి. ఇప్పటికే రెండు సార్లు రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ రోజు మూడో విడత చర్చలు జరగనున్నాయి. గత రెండు సార్లు జరిగిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. తాజా నేడు జరిగే చర్చలపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు రష్యా శాంతికోసం ప్రయతిస్తామంటూ ప్రకటించింది. అయితే తమ హామీలకు మాత్రం కట్టుబడాలని ఉక్రెయిన్ కు అల్టిమేటం విధిస్తోంది. క్రిమియాను తమ దేశంలో అంతర్భాగంగా గుర్తించడంతో పాటు… నాటోలో ఉక్రెయిన్ చేరకుండా లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని రష్యా అంటోంది.