అయోధ్యలో రామ మందిర నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపధ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది కేంద్ర హోం శాఖ. ప్రతిష్టాత్మక కార్యక్రమం కావడం, కొందరు అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్న నేపధ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు. చీమ చిటుక్కుమనకుండా భద్రతా ఏర్పాట్లు చేసారు. అయోధ్య నగరం మొత్తం కేంద్ర బలగాలే మొహరించాయి. శంకుస్థాపన చేసే ప్రాంతంలో కూడా బాంబ్ స్క్వాడ్ సహా ఎన్ఎస్జీ వంటి బలగాలు పెద్ద ఎత్తున తనిఖీలు చేసాయి.
ప్రజలను ఎవరిని బయటకు రానీయడం లేదు. కరోనా భయంతో శానిటేషన్ కూడా చేసారు. మోడీ పర్యటించే ప్రాంతాలు అన్నింటి లో కూడా బలగాలు మొహరించాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు మూడు రోజుల కిందటి నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతీ ఇంటిని తనిఖీ చేసింది. ఇళ్ళల్లో నుంచి ఎవరిని బయటకు రానీయకుండా చర్యలు చేపట్టారు. అత్యవసర సేవలు మినహా ఏ ఒక్కటి కూడా అయోధ్యలో లేవు, అధికారులను కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసారు. నిఘా వర్గాలు కూడా ఆ ప్రాంతంపై దృష్టి పెట్టాయి.