గ్రేటర్ లో కొత్త కార్పోరేటర్లకు,జనాలకు ఊహించని షాకులు

-

ఎన్నికల్లో గెలిస్తే రాజభోగం. ఓడితే ఇంటికే పరిమితం. కానీ..జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. పాత పాలకమండలి రద్దు కాలేదు. గెలిచిన కార్పొరేటర్లు ఛార్జ్‌ తీసుకోలేదు. దీంతో సమస్యల పరిష్కారం అవ్వక జనాలు, ఏ పని చేయలేక కొత్త కార్పోరేటర్లు దిక్కులు చూస్తున్నారు..

గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించాయి. ఓటరు తీర్పు మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. 150 డివిజన్లలో అత్యధిక స్థానాలను గెలుచుకుంది టీఆర్‌ఎస్‌. తర్వాతి ప్లేస్‌లో బీజేపీ, ఎంఐఎం ఉంటే.. కాంగ్రెస్‌ ఖాతాలో రెండు ఉన్నాయి. ఇలా గెలిచిన కార్పొరేటర్లు ఎప్పుడు బాధ్యతలు చేపడతారో తెలియదు. అసలు ఛార్జ్‌ తీసుకుంటారో లేదో అన్న అనుమానాలు ఉన్నాయట. గెలిచామన్న సంతోషం ఆవిరైపోతున్నట్టు కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. 150 మంది కార్పొరేటర్లలో 86 మందే తిరిగి ఎన్నికయ్యారు. మిగిలిన 64 మంది కొత్తవారే.

ప్రస్తుత పాలకమండలి రద్దు కావాలి. కొత్తగా మేయర్‌ పీఠం అధిష్టించేలా రాజకీయ పరిణామాలు మారాలి. కానీ.. ఈ రెండు ఎప్పుడు కొలిక్కి వస్తాయో తెలియదు. ప్రస్తుత పాలకమండలికి 2021 ఫిబ్రవరి వరకు సమయం ఉంది. అప్పటి వరకు గెలిచిన కార్పొరేటర్లు ఎదురు చూడక తప్పదన్నది కొందరి వాదన. మరి.. ఆ తర్వాతైనా కొత్త కార్పొరేటర్ల కొలువు ఉంటుందో లేదో అంతుచిక్కడం లేదట. హైదరాబాద్ చిన్న నగరం కాదు. దాదాపు కోటికిపైగా జనాభా ఉంది. సమస్యలు కూడా ఎక్కువే. వీటి పరిష్కారం కోసం జనం తమకు అందుబాటులో ఉన్న కార్పొరేటర్ల దగ్గరకు వెళ్తారు. కానీ.. జనాలకు వింత పరిస్థితి ఎదురవుతోందట.

ప్రస్తుత పాలకమండలిలోని కార్పొరేటర్ల దగ్గరకు వెళ్లితే.. నేను ఓడిపోయాను కదా.. నా చేతుల్లో ఏముంది అని ముఖం చాటేస్తున్నారట. పోనీ గెలిచిన కార్పొరేటర్ల దగ్గరకు వెళ్లితే.. నేను ఇంకా ఛార్జ్‌ తీసుకోలేదు అని చెప్పి పంపించేస్తున్నారట. అధికారులను ఆశ్రయిస్తే సవాలక్ష రూల్స్‌ చెప్పేవారు కొందరు.. పనికావాలంటే ఇంకేదో ఆశించేవారు మరికొందరు తయారయ్యారట. అదే కార్పొరేటర్లు యాక్టివ్‌గా ఉండి ఉంటే తమకీ బాధలు ఎదురయ్యేవి కావని చెబుతున్నారు ప్రజలు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రజలకు ఎమ్మెల్యేలే దిక్కయ్యారు. క్యాంప్‌ ఆఫీసులు.. ఎమ్మెల్యేల ఇళ్లకు క్యూ కడుతున్నారు జనం. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపోటములపై కొందరు శాసనసభ్యులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ కార్పొరేటర్‌ గెలిస్తే సరి.. లేకపోతే అనుమానంగా చూస్తున్నారట నాయకులు. మరి..జీహెచ్ఎంసీలో రాజకీయ ప్రతిష్టంభన ఎప్పుడు తొలుగుతుందో.. కొత్త పాలక మండలి కొలువుతీరేదెప్పుడో కాలమే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version