ఒక పదవిలో ఉన్న సమయంలో వ్యాఖ్యలు చేసే విషయంలో చాలా రకాలుగా ఆలోచించాలి. రాజకీయంగా ఎంత శక్తివంతులు అయినా సరే కొన్ని కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేది చాలా వరకు మంచిది కాదు. అది ఎవరికి అయినా సరే వర్తిస్తుంది. దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న ప్రతీ ఒక్కరి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
కాని ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమే కాదు ఆయన రాజకీయ భవిష్యత్తుని కూడా ఇబ్బంది పెట్టే విధంగా మారాయి. సుప్రీం కోర్ట్ కి కాబోయే ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంపై ఇప్పుడు దేశంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జాతీయ మీడియా సైతం జగన్ వైఖరిని తప్పుబడుతుంది. జగన్ కు మద్దతు ఇచ్చే న్యాయ నిపుణులు కూడా జగన్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి.
ఢిల్లీ హైకోర్ట్ బార్ అసోసియేషన్, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇలా చాలా వరకు జగన్ తీరుపై మండిపడ్డాయి. అసలు జగన్ ను పదవి నుంచే తొలగించాలి అనే డిమాండ్ లు వస్తున్నాయి. అది అంతా పక్కన పెట్టి… జగన్ భవిష్యత్తులో ఎదుర్కొనే ఇబ్బందులు మరిన్ని ఉండవచ్చు అంటున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వాలకు న్యాయ వ్యవస్థ కాస్త దగ్గరగా ఉంటుందని కొందరు అంటారు.
కేసులు పెట్టాలన్నా, బెయిల్ రావాలని భావించినా సరే న్యాయ వ్యవస్థను పరోక్షంగా ప్రభావితం చేస్తారు అని అంటూ ఉంటారు. అదే న్యాయ వ్యవస్థ మీద ఇప్పుడు జగన్ దాడి చేసారు. కేంద్రం ఆయనకు పరోక్షంగా మద్దతు ఇచ్చినా సరే… ఇప్పుడు న్యాయ వ్యవస్థను జగన్ టార్గెట్ చేసారు కాబట్టి, ఆయనను న్యాయ వ్యవస్థ టార్గెట్ చేయకపోయినా చట్టాల ప్రకారం వెళ్తే… జగన్ కచ్చితంగా ఇబ్బంది పడతారు. ఈ విషయంలో కేంద్రం సహాయం చేసే అవకాశం లేకపోవచ్చు. ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తి అయితే… మాత్రం జగన్ కచ్చితంగా ఎదుర్కొనే ఇబ్బందులు ఊహకు కూడా అందకపోవచ్చు అని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.