దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖీంపూర్ ఖేరీ ఘటనపై సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా కేంద్ర మంత్రి కుమారుడి వాహనం ఢీకోని రైతులు మరణించిన ఘటనపై సుప్రీం కోర్ట్ విచారణ ప్రారంభించింది. ఘటనలో సాక్షులకు భద్రత కల్పించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఘటన జరిగిన సమయంలో నాలుగైదు వేల మంది ఉంటే కేవలం 23 మంది సాక్షులే దొరికారా..? అని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే 68 మందిని సాక్షులుగా గుర్తించామని ఉత్తర్ ప్రదేశ్ తరుపున కేసును వాదిస్తున్న న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు.
కాగా 23 మంది మాత్రమే సాక్షం చెప్పేందుకు ముందుకు వచ్చారని కోర్టుకు వెల్లడించారు. లఖీంపూర్ ఘటనలో మరణించిన విలేకరి శ్యాంసుందర్ మరణంపై నివేదిక ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది. శ్యాంసుందర్ భార్య చెప్పిన ముగ్గురు కీలక నిందితుల విషయం ఏం చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్ లపై నివేదికను సీల్డ్ కవర్లలో సమర్పించాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రిం కోర్ట్ ఆదేశించింది. ఘటనలో లభించిన వీడియోలపై విచారణ వేగవంతం చేయాలని ఫోరెన్సిక్ టీంను ఆదేశించింది. తర్వాతి విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది.