మహిళపై దాడి.. భాజపా నేతకు యోగి సర్కార్‌ ఝలక్‌..!

-

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అక్రమనిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంటారు. వాటిని కూల్చేసేందుకు బుల్డోజర్లు దూసుకెళ్తుంటాయి. అయితే ఈసారి నోయిడా హౌసింగ్ సొసైటీలో భాజపా నేత ఇంటిపై వాటిని ఉపయోగించారు. అంతకుముందు సదరు నేత ఓ మహిళపై దాడి చేసిన నేపథ్యంలో.. యోగి సర్కారు ఇలా ఝలక్ ఇవ్వడం గమనార్హం. ఇంతకీ విషయం ఏంటంటే..?

భాజపాకు చెందిన కిసాన్ మోర్చాకు చెందిన నేత చెప్పుకుంటోన్న శ్రీకాంత్ త్యాగి నోయిడాలోని గ్రాండ్ ఒమాక్సే సొసైటీలో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం అదే సొసైటీలో ఉంటే ఓ మహిళతో గొడవ జరిగింది. త్యాగి కొన్ని మొక్కలు నాటడానికి ప్రయత్నించగా.. అది నిబంధనలకు విరుద్ధమని ఆ మహిళ వాదించింది. ఇక్కడ నాటేందుకు తనకు హక్కు ఉందంటూ ఆయన దరుసుగా ప్రవర్తించారు. ఆమెను దుర్భాషలాడి, దాడికి పాల్పడిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. దీని తర్వాత త్యాగి మద్దతుదారులు ఆ నివాసప్రాంగణంలోకి వచ్చి మహిళకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా ఆమె చిరునామా గురించి ఆరా తీశారు.

ఈ గొడవ వైరల్‌ అయిన నేపథ్యంలో శ్రీకాంత్ తాను భాజపా కిసాన్‌ మోర్చా సభ్యుడినని చెప్పుకోవడంతో పాటు సీనియర్ నేతలతో ఉన్న ఫొటోలను పోస్టు చేశారు. కానీ పార్టీ మాత్రం ఆయనకు దూరం పాటించింది. ఆయన ప్రకటనలను తోసిపుచ్చింది. ఈ వివాదాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని చర్యలకు ఉపక్రమించింది. ఈ రోజు పోలీసులు, అధికారులు త్యాగి ఇంటికి చెందిన అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టారు. అలాగే ఆయన మద్దతుదారులను అరెస్టు చేశారు. దీనిపై దిల్లీకి చెందిన భాజపా ప్రతినిధి కేమ్‌చంద్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. దురుసుగా వ్యవహరించిన త్యాగిపై చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదిలా ఉంటే.. ఆ ఘటన తర్వాత నుంచి త్యాగి పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ.25 వేలు రివార్డు అందించనున్నట్లు నోయిడా పోలీసులు ప్రకటించారు. ఆయన ఫోన్‌ సిగ్నళ్లు చివరగా ఉత్తరాఖండ్‌లో గుర్తించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news