కీలక దశకి చేరిన అమెరికా ఎన్నికలు..రేపే మూడో ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌…!

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. మరో రెండు వారాల సమయమే ఉండటంతో.. ట్రంప్‌, బైడెన్‌ క్లైమాక్స్‌ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మూడో ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌కు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థులు..మూడు బహిరంగ చర్చల్లో పాల్గొనడం చర్చించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ట్రంప్‌, బైడెన్‌ల మధ్య తొలి సంవాదం సెప్టెంబరు 29న జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకే ట్రంప్‌ కరోనా బారినపడ్డారు. అనంతరం ఆయన కోలుకున్నప్పటికీ.. రెండో చర్చను వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ట్రంప్‌ విముఖత వ్యక్తం చేయడంతో దానిని రద్దు చేశారు. రేపు గురువారం మూడో డిబేట్‌ జరగనుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ల మధ్య మూడో డిబేట్‌ మరింత హుందాగా జరపాలని డిబేట్‌ను పర్యవేక్షించే కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు నియమ నిబంధనలను మారుస్తున్నట్లు ప్రకటించింది. తొలి ముఖాముఖి చర్చలో ఇద్దరు నేతలూ ఒకరికొకరు పరుష పదజాలంలో విమర్శించుకున్నారు. దీంతో చర్చ రసాభాసగా సాగింది. ఈ నేపథ్యంలో మూడో ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో ఎలాంటి రచ్చ జరగకుండా.. ఒకరి ప్రసంగానికి మరొకరు అడ్డుపడకుండా మైక్‌ను కట్‌ చేయాలని కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు మ్యూట్‌ బటన్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

అభ్యర్థులు ఒకరు మాట్లాడేటప్పుడు మరొకరు జోక్యం చేసుకోకుండా ఇది అడ్డుపడుతుంది. అయితే కమిషన్ నిర్ణయం పట్ల ట్రంప్ బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. తొలి నుంచి పక్షపాతంగా వ్యవహరిస్తున్న డిబేట్‌ కమిషన్‌.. బైడెన్‌కు లబ్ధి చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించింది. అయినా, చర్చలో పాల్గొంటామని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news