కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి భౌతికదూరం పాటించడం, రెండోది మాస్క్ ధరించడం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు సాగుతున్నాయి. పలుదేశాల్లో క్లినికల్ ట్రయల్స్ కూడా నడుస్తున్నాయి. అయితే.. మనల్ని వ్యాక్సిన్ కన్నా మాస్కే ఎక్కువగా కాపాడుతుందని, మాస్కే అత్యంత శక్తివంతమైన ప్రజారోగ్య సాధనమని యునైటెడ్ స్టేట్స్ లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) డైరెక్టర్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ వెల్లడించారు. ఫేస్ మాస్క్‌లు మెరుగైన రక్షణను అందిస్తున్నాయని ఆయన చెప్పారు. భారత్‌లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఎలాగో.. అమెరికాలో సీడీసీ అలాగ.
సెనేట్ సబ్ కమిటీ విచారణలో యూఎస్ చట్టసభ సభ్యుల ప్రశ్నలకు రెడ్‌ఫీల్డ్ పై విధంగా స్పందించారు. ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. మాస్క్‌లు మాత్రం తప్పకుండా ధరించాలని, ఎందుకంటే.. టీకా కంటే ఫేస్‌మాస్కే ఎక్కువగా మనల్ని కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేగాకుండా.. వచ్చే ఏడాది అంటే జనవరిలో అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ ఎంతమేరకు ప్రభావం చూపుతుందో ఎవరికీ తెలియదని ఆయన అన్నారు. అయితే.. ప్రారంభంలో వచ్చే టీకాలు పెద్దగా ప్రభావవంతమైనవి కావని, కనీసం 75శాతం మందిని కాపాడితే తాము అదృష్టమంతులమని వ్యాక్సిన్ డెవలపర్లు సూచిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో రెడ్‌ఫీల్డ్ చెప్పిన మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ ప్రజలందరూ మాస్క్‌లు ధరిస్తే కరోనాను తొందరగా అదుపులోకి తీసుకురావొచ్చునని ఆయన సూచించారు.