అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ లైఫ్ స్టైల్ ఇదే…!

-

జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ 1942లో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాంటన్‌లో జన్మించారు. ఐర్లాండ్ నేపథ్యం ఉన్న ఓ కాథలిక్ కుటుంబంలో పుట్టారు బైడెన్‌. చిన్నప్పుడే బైడెన్‌ కుటుంబం డెలవెర్‌లో స్థిరపడింది. నిజానికి వారిది సంపన్న కుటుంబమేగానీ.. బైడెన్‌ పుట్టే సమయానికి ఆయన తండ్రి తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. దీంతో చాలా కాలం పాటు బైడెన్‌ కుటుంబం పేదరికంలో గడిపింది. తర్వాత కొద్దిగా కోలుకుని మధ్యతరగతి జీవనం గడిపింది. బైడెన్‌లో చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అధికం. స్కూల్‌ డేస్‌లోనే లీడర్‌గా వ్యవహరించారు. జీవితంలో ఎన్నో విషాదాలు..మరెన్నో చేదు అనుభవాలు. లూజర్.. ఫెయిల్యూర్.. నిరాశావాది.. ఇవి జోబైడెన్‌ గురించి ప్రత్యర్థులు చెప్పే మాటలు కానీ బైడెన్ అనుకున్నంత సాఫీగా ఏం సాగలేదు.

అర్క్‌మెర్ అకాడమీలోచదువుకున్నారు బైడెన్. స్కూల్‌ విద్య తర్వాత మొదట యూనివర్సిటీ ఆఫ్ డెలవేర్‌లో, తరువాత సిరక్యూస్ యూనివర్సిటీ లా స్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. సిరక్యూస్ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందే ముందు డెలావేర్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు బైడెన్‌. 1969లో న్యాయవాదిగా అయ్యాడు. 1966లో బైడెన్‌కు తొలిసారి వివాహమైంది. నెలియాను వివాహమాడిన తరువాత విల్మింగ్టన్‌లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు బైడెన్‌. అప్పట్లో బైడెన్‌కు డెలవేర్‌ గవర్నర్‌ అయిన డెమొక్రాటిక్‌ నాయకుడి విధానాలపై ఆగ్రహం ఉండేది. రిపబ్లికన్‌ అభ్యర్థి భావాలు నచ్చేవి. డెమొక్రాటిక్‌ పార్టీలో చురుగ్గా వ్యవహరించే ఒక వ్యక్తి నిర్వహించే న్యాయసంస్థలో పనిచేశారు. అక్కడ ఉండగానే తన భావాలు మార్చుకొని డెమొక్రాట్‌గా తన పేరు నమోదు చేసుకున్నారు.

ఇలా బైడెన్‌ రాజకీయ జీవితం ప్రారంభమైంది. తొలుత స్థానిక కౌంటీ కౌన్సిల్‌కు ఎన్నికైన బైడెన్‌.. 1972లో జూనియర్‌ సెనెటర్‌గా ఎన్నికయ్యారు. చేతిలో డబ్బుల్లేకపోవడంతో.. బైడెన్‌ కుటుంబసభ్యులు ఇంటింటికీ తిరగి కరపత్రాలు పంచి ప్రచారం చేశారు. బైడెన్‌ ప్రత్యర్థి మాత్రం భారీగా ప్రచారం చేశారు. అయినా బైడెనే గెలిచారు. దురదృష్టవశాత్తూ ఆ ఏడాది భార్య, ఏడాది వయసున్న కుమార్తె ప్రమాదంలో చనిపోయారు. ఆ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన కుమారులిద్దరూ ఆస్పత్రిలో ఉండగా.. సెనెట్‌ సభ్యుడుగా బైడెన్‌ ఆస్పత్రిలోనే ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సంఘటన అప్పట్లో అందరినీ విశేషంగా ఆకర్షించింది. భార్య, కూతురి మరణం తరువాత తన కొడుకులిద్దరికీ మంచి జీవితం అందించాలనే తాపత్రయంతో తన సొంతిల్లు ఉన్న డెలవేర్ నుంచీ వాషింగ్టన్‌కు రోజూ వచ్చి వెళ్తుండేవారు.

1977లో ఆయన జిల్‌ ట్రేసీ జాకబ్స్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె. 30 ఏళ్ల వయసుకే సెనెటర్‌గా ఎన్నికైన బైడెన్‌ చురుగ్గా పనిచేయడంతో టైమ్‌ మేగజైన్‌ 1974లో బైడెన్‌ను ఫేసెస్‌ ఫర్‌ ద ఫ్యూచర్‌లో ఒకరిగా పేర్కొంది. 1987లో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి పోటీలో తొలిసారిగా అడుగు పెట్టే ప్రయత్నాలు చేశారు. అప్పటి బ్రిటిష్ లేబర్ పార్టీ లీడర్ నీల్ కినోక్ ఉపన్యాసాన్ని బైడెన్ అనుకరించారంటూ ఆరోపణలు రావడంతో ఆయన ప్రయత్నాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. 2008లో డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న బరాక్ ఒబామా, తనకు తోడుగా ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి జో బైడెన్‌ను ఎంచుకున్నారు. ఆ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ గెలిచింది. ఒబామా-బైడెన్‌ జోడీ 2008ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీకి చెందిన జాన్‌ మెక్‌కెయిన్‌, సారా పలిన్‌లను ఓడించింది.

ఒబామా-బైడెన్ జంట ఆ తర్వాత 2012 అధ్యక్ష ఎన్నికల్లోనూ గెలిచింది. బైడెన్ చాలా సార్లు ఒబామాను తన సోదరునిగా అభివర్ణించారు. ఒబామా, తన అధ్యక్ష పదవి ఆఖరు రోజుల్లో బైడెన్‌కు అమెరికా దేశ అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం పురస్కారం ఇచ్చి సత్కరించారు. జో బైడెన్‌ అంటే నటన లేని ప్రేమ, స్వార్థం లేని సేవ, జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించే తత్వమని ప్రశంసించారు ఒబామా. అంత గొప్ప దశలో కూడా బైడెన్‌కు వ్యక్తిగతమైన బాధలు తప్పలేదు. 2015లో ఆయన కుమారుడు బౌ బ్రెయిన్ 46 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మరణించారు. బౌ బైడెన్ రాజకీయాల్లో తన తండ్రికి వారసుడిగా కొనసాగుతారని అందరూ ఆశించారు. కానీ ఇంతలోనే ఈ విషాదం జరిగింది.

50 ఏళ్ల పొలిటికల్ కేరీర్ లో బైడెన్ ఏకంగా 47 భారీ వైఫల్యాలను మూటగట్టుకున్నారంటూ చెబుతుంటోంది ట్రంప్‌ వర్గం. బైడెన్ జీవితంలో నిజంగానే భయానక విషాదాలు చోటుచేసుకున్నాయి. కానీ రెండో భార్య జిల్ బైడెన్ సాయంతో ఆయన కుంగుబాటును, చీకటిని అధిగమించగలిగారు. మరోవైపు ట్రంప్‌ అంత వివాదాలు కాకపోయినా.. కొన్ని వ్యక్తిగతంగా విమర్శలు మూటగట్టుకున్నారు జోబైడెన్‌. బహిరంగ కార్యక్రమాల్లో మహిళలను ఆలింగనం చేసుకోవడం..వారిని ముద్దు పెట్టుకుని..భూజాలపై చేతులు చేసి అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయ్‌.2008లో పాకిస్థాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ బైడెన్‌కు హిలాల్‌ ఇ పాకిస్థాన్‌ అవార్డును ప్రకటించారు. ఆ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అది. రిపబ్లికన్‌ సెనెటర్‌ రిచర్డ్‌ లుగర్‌తో కలిపి పురస్కారాన్ని ఇచ్చారు.

బైడెన్‌ విజయంలో ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ ఎంతో కీలకంగా వ్యవహరించారు. బోధనను వృత్తిగా ఎంచుకున్న జిల్.. ఒబామా హయాంలో సెకండ్ లేడీ హోదాలో ఉంటూనే తన వృత్తిని కొనసాగించారు. అమెరికాలో విద్యా వ్యాప్తి, కమ్యూనిటీల బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బైడెన్‌ వెన్నంటే ఉండి అనునిత్యం ఆయనకు అండగా నిలబడ్డారు. ప్రచారంలో ఓసారి బైడెన్‌ పైకి నిరసనకారులు దూసుకొచ్చిన సమయంలోనూ జో బైడెన్‌కు రక్షణగా నిలబడి అందర్నీ ఆకర్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news