తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకి అత్యంత సన్నిహితురాలు, శశికళ నటరాజన్ త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారనే ప్రచారం కొద్ది రోజుల క్రితం జరిగింది. ముఖ్యంగా, ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలు నుంచి విడుదలవుతారని బీజేపీకి చెందిన సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు అపట్లో తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న శశికళని స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసే ప్రక్రియలో భాగంగా శశికళను కూడా విడుదల చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఆ డేట్ లు అన్నీ మారిపోవడంతో ఇప్పుడు మరో కొత్త ప్రచారం మొదలయింది. ఆమె వచ్చే జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ కానున్నారని ఆమె తరపు లాయర్ పేర్కొన్నేరు. 2016లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన కొన్న నెలలకే జయలలిత అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత శశికళ ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించినా అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో శశికళ సహా ఇరవళసి, సుధాకరన్‌లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.