ముంబైలోని జైలులో ఉన్న విరసం నేత వరవరరావును మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆసుపత్రికి తరలించింది. అనారోగ్యం నుంచి వరవరరావు పూర్తిగా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉంచాలన్న ప్రొపెసర్ హరగోపాల్ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం గత రాత్రి ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించింది. తీవ్ర అస్వస్థతకు గురైన వరవరరావు గతంలో ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే ఆయన పూర్తిగా కోలుకోకుండానే గత నెల 1న డిశ్చార్జ్ చేశారు. వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించారని…
ఆయనను అమానుషంగా జైలులో నిర్బంధించిందని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాత్కాలిక బెయిల్ కోసం వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతోపాటు తన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్న దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు. వరవరరావుకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ జూన్ 26న ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఒక పిటిషన్, వరవరరావు మెడికల్ రికార్డులను అందజేసేలా నవీ ముంబైలోని తలోజా జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు.