ఉపన్యాసాలతో ఉద్యమానికి ప్రాణం పోసిన వీర వనిత సరోజినీ నాయుడు..

-

నవతరంలో దేశభక్తి స్ఫూర్తిని మరింతగా నింపడం సహా మన మూల విలువలను సంపన్న సంస్కృతిని ప్రతిబింబించే నవభారతంతో స్వతంత్ర్య సమరయోధులను అనుసంధానించడమే ‘ఆజాదీ నా అమృత్ మహోత్సవ్’ లక్ష్యం. దేశం నిరంతరం స్వావలంబన దిశగా పయనిస్తోంది. ఆ మేరకు స్వాతంత్య 75వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రారంభించిన ”అమృత్ మహోత్సవ్’ స్వావలంబన వైపు ఒక ముఖ్యమైన ముందడుగు, ఈ వేడుకలను 2023 ఆగస్టు 15 వరకూ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్వాతంత్య్రం అమృత్ మహోత్సవాల క్రమంలో కొందరు. వీరులను మేం పరిచయం చేస్తున్నాం. దేశానికి స్వాతంత్యం సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. వారిలో ఒకరు సరోజినీ నాయుడు.
సరోజినీ నాయుడు భారత కోకిలగా పిలవబడేవారు. (నైటింగేల్ ఆఫ్ ఇండియా ) సరోజినీ నాయుడు స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి. ఈమె క్రీ.శ. 1879 వ సంవత్సరం ఫిబ్రవరి 13 వ తేదీన హైదరాబాద్లో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి డా.అఘోరనాథ్ చటోపాద్యాయా, తల్లి శ్రీమతి వరద సుందరి. శ్రీమతి సరోజినీ నాయుడు తల్లి దండ్రులు విధ్యావంతులవ్వడం వలన, సరోజినిలో చిన్నతనం నుంచే కార్యదీక్షా, పట్టుదలా, విద్యపై తిరుగులేని సదభిప్రాయాలు ఉండేవి.
ఈ దేశం బానిస తనం నుంచీ, నియంతృత్వ సంకెళ్ళ నుంచీ విముక్తి పొంది నాది, నేను అన్న భావంతో అఖిల భారత ప్రజానీకం స్వేచ్ఛా, స్వాత్రంత్ర్యాలతో జీవించాలన్నదే సరోజినీ నాయుడు మహత్తర ఆశయం. భారతదేశంలో పురుషులే కాక, భారత మహిళలు ఏ రంగంలోనూ, తీసిపోరని నిరూపించిన వీర మహిళలు మన దేశంలో చాలా మంది పుట్టారు. అటువంటి వారిలో శ్రీమతి సరోజినీ నాయుడు కూడా ఒకరు.
సరోజిని నాయుడు మంచి రచయిత్రి. పద్య రచయిత. చిన్నతనం నుంచీ ఆమెకు ఇంగ్లీషు భాషమీద చాలా ఇష్టం ఉండేది. ఇంగ్లీషు మాట్లాడాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూండేది. ఆ పట్టుదలా, ధ్యేయాలతోనే ఇంగ్లీషు భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించింది. పదకొండో సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడి అందరినీ మంత్రముగ్ధులన్ని చేసింది. ఆ వయసులోనే ఇంగ్లీషులో రచనలు ఆరంభించింది సరోజిని నాయుడు.
అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ ఆ రోజులలో గోపాల కృష్ణ గోఖలే నాయకత్వంలో ఉద్యమాలు సాగిస్తోంది. వీరు మహిళాభివృద్దికి ఎంతో కృషిచేసి 1906లో మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పరచి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో పాటు పడ్డారు. స్వాతంత్ర్య సాధనలో తనూ పాలుపంచుకోవాలని ఆలోచించిన శ్రీమతి సరోజినీ నాయుడు కాంగ్రెస్ జాతీయ భావాలకు అనుగుణంగా నడుచుకోనారంభించింది.
1915వ సంవత్సరం బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో, 1916లో జరిగిన లక్నో కాంగ్రెస్ సభలలో ఆమె పాల్గొన్నారు.. ఆనాటి కాంగ్రెస్ భావాలు చాలా ఆదర్శంగా ఉండేవి. సరోజినీనాయుడు భారత దేశంలో గల ముఖ్యమైన, నగర, పట్టణాలు తిరుగుతూ స్వాతంత్ర్యోద్యమ ఉపన్యాసాలిచ్చి, ప్రజలతో భాష విప్లవము వచ్చేందుకు కారకురాలయ్యారు. మృదువుగా మాట్లాడుతూ, ఎంత కఠినమైన విషయాలైనా, శ్రోతల గుండెలను హత్తుకుని మరుగున ఉన్న యదార్థ స్థితిని అర్థమయ్యే విధంగా ఆమె గంభీరమైన ఉపన్యాసం విన్న శ్రోతలకు కాలం, శ్రమ తెలిసేవి కాదు.
ఉపన్యాసాలతో ఉత్తేజం..
ఆమె ఉపన్యాసాలు దేశభక్తిని నూరి పోసి చావుకు కూడా భయపడని తెగింపును తేగలిగాయి. “జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు జరిగితే దేశానికి జరిగినట్టే, దేశం అనుభవించే బానిసతనం నీవూ అనుభవించవలసినదే” అంటూ దేశమంతా తిరిగి దేశభక్తిని నూరిపోసింది. ఈ విశ్రాంతి లేని ప్రయాణాలతోనూ, ఉపన్యాసాలతోనూ ఆమె ఆరోగ్యం పాడైంది. 1919 సంవత్సరంలో పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ జనరల్ డయ్యర్ నేతృత్వంలో హత్యా కాండ జరిగింది. ఆ సమయానికి సరోజినీనాయుడు లండన్ నగరంలో చికిత్స పొందుతోంది. ఈ విషయం ఆమె లండన్ నగరంలో విన్నది. ఆమె గుండె ఆ వార్తకు నీరయిపోయింది. అప్పటికే ఆమె గుండెజబ్బుతో ఆరోగ్యం బాగా దెబ్బతింది.. అయినా చనిపోయే ప్రతి భారతీయుని భయంకరమైన కేకలు ఆమె చెవుల్లో గింగురుమన్నాయి. ఆ పరిస్థితిలో తను ఉండి కూడా ఆరోగ్యాన్ని ఏమాత్రం లెక్క చేయక క్రూరుడైన పంజాబ్ గవర్నర్ డయ్యర్ మీద ఆందోళన లేవదీసింది.
భారతీయుల హక్కుల గురించి భారతీయులను తమ బానిసలుగా చేసి వారి ప్రాణాలు సైతం బలి తీసుకోవటం క్షమించరాని అపరాధం” అంటూ ఆడపులిలా గర్జించింది. 1947, ఆగష్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. సరోజినీనాయుడు దేశానికి చేసిన సేవలు దృష్టిలో ఉంచుకుని ఈమెకు ఉత్తర ప్రదేశ్ గవర్నర్ పదవి ఇచ్చి సత్కరించారు. వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉండి కూడా ఆమె ఉత్తరప్రదేశ్‌కు చేసిన సేవ, కార్యదక్షత ఎన్నటికీ మరపురానివి.

Read more RELATED
Recommended to you

Latest news