ఉద్యమ కెరటం నేల రాలింది.. ఆమె పోరాటం గెలవాలి…!

-

ఫ్లోరైడ్ బాధితులు… ప్రపంచం ఎయిడ్స్ గురించి భయపడిన దాని కంటే… ఇప్పుడు కరోనా గురించి భయపడుతున్న దాని కంటే వెయ్యి రెట్లు, కోటి రెట్లు, భూపాల్ గ్యాస్ ప్రమాదంతో సమానంగా చెప్పుకునే సమస్య ఇది. భవిష్యత్తు తరాలు ఎలా పుడతాయో… ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏ విధంగా మారతారో… ఏ విధంగా వారి జీవితం మారుతుందో ఎవరూ కూడా చెప్పలేని పరిస్థితి. ఎన్ని చర్యలు ప్రభుత్వాలు తీసుకున్నా వారి జీవితాలు మాత్రం మారలేదు అనేది వాస్తవం. అందరూ మరగుజ్జులే… అందరూ వికలాంగులే… అందరికి ఆరోగ్య సమస్యలే.

తెలంగాణాలో ఈ సమస్య ఒకప్పుడు తన ప్రతాపం దారుణంగా చూపించింది. దీని గురించి రాజకీయ పార్టీలు ఎన్నో పోరాటాలు చేసాయి. అక్కడి ప్రజల గురించి జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా, స్థానిక మీడియా, నిన్నా మొన్న వచ్చిన సోషల్ మీడియా కూడా కథనాలు రాసాయి. ఎన్నికల హామీలు ఇచ్చారు… ఎన్నో జరిగాయి. అయినా సరే ఫ్లోరైడ్ సమస్య మాత్రం పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇప్పుడు తెలంగాణా సర్కార్.. మిషన్ భగీరధ నీళ్ళు ఇవ్వడం తో అక్కడ తాగునీటి సమస్య కాస్త పరిష్కారం అయింది.

కృష్ణా నదీ జలాలను నల్గొండ కు తీసుకుని వెళ్ళడంతో సమస్య కాస్త తగ్గుముఖం పట్టింది. అయినా సరే గతంలో దీని బారిన పడిన వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం లేదు. మనిషి జీవ కణాల్లో అది ప్రభావం చూపిస్తుంది. వీర్య ఉత్పత్తి నుంచి ప్రతీ ఒక్కటి కూడా దాని బారిన పడేవే. అలాంటి ఫ్లోరైడ్ గురించి వీరమల్ల రజిత అనే అమ్మాయి చేసిన పోరాటం నేటి ప్రపంచానికి సరిగా తెలియకపోయినా… మూడు అడుగులు కూడా లేని ఆ అమ్మాయి… ఫ్లోరైడ్ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ కి తీసుకుని వెళ్ళింది.

తాగు నీరే కాదు సాగు నీరు కూడా కావాలి… ఇస్తున్న పెన్షన్ చాలడం లేదు పది వేలు ఇవ్వాలి… ఫ్లోరైడ్ సమస్యను జాతీయ విపత్తుగా ప్రకటించాలని నాలుగు అడుగులు సరిగా వేయలేని అమ్మాయి తన పోరాటాన్ని ఏ మాత్రం కూడా విశ్రమించకుండా కొనసాగించింది. నా కంట్లో కన్నీళ్లు కూడా ఆవిరి అయిపోయాయి, నా తల్లి తండ్రుల మీద ఆధారపడలేను అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో ఆమె మీడియా గొట్టాలకు చెప్పిన మాటలు ఇంకా నల్గొండ జిల్లాలో వినపడుతూనే ఉన్నాయి. భవిష్యత్తు తరాలు ఇలా ఉండకూడదు అంటూ గళం ఎత్తింది.

ఆమె వయసు కేవలం 24 ఏళ్ళు. ఈ 24 ఏళ్ళ వయసులో ఆమె చేసిన పోరాటం తెలంగాణా చరిత్రలో నిలిచిపోతుంది. ఆమె గళం గట్టిగా వినపడకపోవడంతో గత పాలకులు పెద్దగా ఆమెను పట్టించుకోలేదు. అలాంటి ఉద్యమ కెరటం నేడు నేల రాలింది. నల్గొండ జిల్లాలోని తన గ్రామంలో ఆమె తన పోరాటాన్ని విశ్రమించింది. 2014 లో ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను నిగ్గదీసి అడుగు అనే కార్యక్రమం చేస్తున్నప్పుడు నల్గొండ జిల్లా ఖుదాబక్ష్ అనే ఊరిలో ఆమెను గుర్తించారు. ఆమె కష్టం ఆమె పోరాటం చూసిన ఉదయభాను…

తల్లి తండ్రుల మీద ఏ మాత్రం ఆధారపడకూడదు అని భావించి ఆమెతో కిరాణా షాప్ పెట్టించారు. ఆ ఊరి పేరు అర్ధం దేవుడు రక్షించుగాక అని. కాని దేవుడు ఆమెను రక్షించలేదు. ఆమె గ్రామాన్ని ఫ్లోరైడ్ నుంచి కాపాడలేదు. అనారోగ్య సమస్యలతో పోరాటం చేస్తున్న ఆమె నేను పోరాడలేను అంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. తెలంగాణా ఫ్లోరైడ్ ఉద్యమంలో వీరమల్ల రజిత అనే పేరు చిరస్థాయిగా నిలుస్తుందని ఉద్యమకారులు చెప్తున్నారు. ఆమె ఉద్యమాన్ని… ఆమె స్పూర్తితో కొనసాగించాలని కోరుతున్నారుమోసం చేయకుండా కష్టపడి బతికి పదిమందికి సాయం చేయాలి అన్న ఆ మనోధైర్యం, ఎడ్చటానికి కూడ కన్నీళ్ళు ఎండిపోయినయి అన్న ఆ గొంతు మూగబొయింది.

Read more RELATED
Recommended to you

Latest news