రెండు రోజుల కిందట కనిపించకుండా పోయిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ మృతి చెందారు. సోమవారం సాయంత్రం మంగళూరు సమీపంలోని నేత్రావతి నది వద్ద ఆయన కనిపించకుండా పోయారు.
రెండు రోజుల కిందట కనిపించకుండా పోయిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ మృతి చెందారు. సోమవారం సాయంత్రం మంగళూరు సమీపంలోని నేత్రావతి నది వద్ద ఆయన కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఆయన రాసినట్టుగా భావిస్తున్న ఓ లేఖ పోలీసులకు దొరికింది. దీంతో సిద్ధార్థ నేత్రావతి నదిలోనే దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావించారు.
అయితే నేత్రావతి నది వద్దే సిద్ధార్థ కనిపించకుండా పోయే సరికి ఆయన కచ్చితంగా అందులోనే దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుకున్న పోలీసులు గజ ఈత గాళ్లు, నేవీ హెలికాప్టర్‌తో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి వారు నదిని జల్లెడ పట్టగా ఇప్పుడే సిద్ధార్థ మృతదేహం పోలీసులకు లభించింది. మంగళూరులోని హోయిజ్ బజార్ సమీపంలో ఉన్న నేత్రావతి నది బ్యాక్ వాటర్‌లో సిదార్థ మృతదేహం లభ్యమైంది.
కాగా సిద్ధార్థ రాసినట్టుగా భావిస్తున్న లేఖలో.. తాను లాభాలు సృష్టించే వ్యాపార నమూనాను తయారు చేయలేకపోయినందుకు చింతిస్తున్నానని, తాను అన్ని విధాలు విఫలమయ్యానని, తన కంపెనీల్లో నిర్వహించిన లావాదేవీలకు తానే బాధ్యుడినని పేర్కొన్నారు. ఇక వ్యాపారం అభివృద్ధి కోసం శాయశక్తులా ప్రయత్నించానని, అయినా విఫలమయ్యానని, తనపై నమ్మకం ఉంచిన వారిని ఆదుకోలేకపోతున్నానని తెలిపారు. ఇన్నాళ్లూ ఒత్తిడితో పని చేశానని, ఇకపై ఒత్తిడిని భరించలేనని, అందుకే అన్నింటి నుంచి విరమించుకుంటున్నానని సిద్ధార్థ తన లేఖలో తెలిపాడు.
కాగా వీజీ సిద్ధార్థ సంస్థ కేఫ్ కాఫీ డే దేశ వ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగానూ పేరుగాంచింది. ఈ కేఫ్‌లు ఇండియా మొత్తం 1750 వరకు ఉన్నాయి. మలేషియా, నేపాల్, ఈజిప్టు తదితర దేశాల్లోనూ కేఫ్ కాఫీ డేలను నిర్వహిస్తున్నారు. అయితే తన కంపెనీల్లో తాను నిర్వహించిన లావాదేవీలకు పూర్తి బాధ్యత తనదేనని, తనను చట్టం దోషిగా చిత్రీకరించాలని సిద్ధార్థ తన లెటర్‌లో కోరాడు..!